ప్రేమోన్మాదం.. కేవలం అమ్మాయికి మాత్రమే కాదు, అమ్మాయి తల్లిదండ్రులకు కూడా ఇబ్బందికరంగా మారిన ఘటనలు చాలానే చూశాం. ఇది కూడా అలాంటిదే. ప్రేయసిని తన నుంచి దూరం చేసినందుకు, ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. యువతి తల్లిదండ్రుల్ని దారుణంగా హత్య చేశాడు.
వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన శ్రీనివాస్- సుగుణ దంపతుల కుమార్తె దీపిక. ఈమెను బన్నీ అనే యువకుడు ప్రేమించాడు. ఆమె కూడా ఇతడ్ని ప్రేమించింది. గతేడాది నవంబర్ లో ఇద్దరూ పారిపోయి పెళ్లి కూడా చేసుకున్నారు.
అయితే తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. యువతిని తల్లిదండ్రులతో పంపించారు. అప్పట్నుంచి శ్రీనివాస్- సుగుణలపై కక్ష పెంచుకున్నాడు బన్నీ. ఓవైపు యువతి మాత్రం బుద్ధిగా ఇంట్లో కూర్చొని డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకుంటోంది.
కూతురు దారిలోకొచ్చిందని గ్రహించిన తల్లిదండ్రులు ఆమెకు పెళ్లిచూపులు చూడడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న బన్నీలో కోపం కట్టలు తెంచుకుంది. తన భార్యను వేరే వ్యక్తికి ఎలా ఇచ్చి పెళ్లి చేస్తారని పలుమార్లు గొడవకు దిగాడు.
ఊర్లో వాళ్లు సర్దిచెప్పి పంపించారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఆరుబయట నిద్రిస్తున్న శ్రీనివాస్-సుగుణను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు బన్నీ. ఈ దాడిలో దీపిక, ఆమె సోదరుడు కూడా గాయపడ్డారు.