వైసీపీ సస్పెండ్ చెయ్యాల్సింది ఎమ్మెల్యేలనేనా?

నిప్పు లేనిదే పొగ రాదు. మనకి కనపడేది వచ్చే పొగే కానీ, ఆ పొగ రావటానికి నిప్పురాజేసిన కారణభూతులు కనపడరు. ఇక్కడ మనకి కనపడే పొగ పాత్రలో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు ఉంటే, మంట…

నిప్పు లేనిదే పొగ రాదు. మనకి కనపడేది వచ్చే పొగే కానీ, ఆ పొగ రావటానికి నిప్పురాజేసిన కారణభూతులు కనపడరు. ఇక్కడ మనకి కనపడే పొగ పాత్రలో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు ఉంటే, మంట రాజేసిన పాత్రలో సలహాదారులు ఉన్నారు అని విశ్లేషకులు అంటున్నారు. 

ప్రజల్లో బలం ఉన్న పార్టీలో నుండి వేరే పార్టీ లోకి వెళ్లాలని ఏ సిట్టింగ్ ఎమ్మెల్యే అనుకోడు, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వెళ్లాలనుకుంటాడు. ఆ ప్రత్యేక పరిస్థితులు సృష్టించబడితే ఖచ్చితంగా పార్టీని వీడాలనిపిస్తుంది. వైసీపీ ముఖ్య సలహాదారుడు దాదాపు 40-50 మంది ఎమ్మెల్యేలకు ఇలాంటి పరిస్థితి సృష్టించాడు అని పార్టీ పెద్దలు మాట్లాడుకుంటున్నారు.

2014 ఎన్నికల ముందు జగన్ జైల్లో ఉన్నప్పుడు దాదాపు 70 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో తప్పుడు సర్వే రిపోర్టులు ఇచ్చి ఒక సారి వెన్నుపోటు పొడిసింది ఈ సలహాదారుడే అని అప్పట్లో చాలా మంది నాయకులు మాట్లాడుకున్నారు. అధిష్టానం కూడా కొద్ది రోజులు ఇతన్ని పార్టీ నుండి దూరం పెట్టింది. 2019 లో మళ్ళీ అధికారంలోకి రాగానే ముఖ్యమైన పదవిలోకి వచ్చి పార్టీ మీద తన పగ తీర్చుకుంటున్నాడు అంటున్నారు. ఒక సారి వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని జగన్ మళ్ళీ ఎందుకు పక్కన పెట్టుకున్నారు అని అప్పట్లో కొంతమంది నాయకులు అడిగినా, మారిపోయి ఉంటాడులే అని సర్దిచెప్పుకున్నారు.

ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గంలో, తన హయాంలో, ఏవో కొన్ని గుర్తు ఉండిపోయే అభివృద్ధి పనులు చేయాలనే కోరిక ఉంటుంది. ఇందుకోసం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ని కలసి తమ కోరికలు చెప్పుకొని నిధులు కోరతారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినా గాని నిధులు మాత్రం విడుదల అవ్వవు. సలహాదారుడు మరియు ఇంకొక అధికారి కలసి, వాళ్ళు టార్గెట్ చేసిన పార్టీ ఎమ్మెల్యేలను అనేక రకాలుగా విసిగించి, చిరాకు పరుస్తారు, ఓర్పు సహనం కోల్పోయేలా చేస్తారు. 

సీఎం గారి దర్శన భాగ్యం కలగకుండా చేస్తారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యేలు ఎవరితోనైనా, ఎక్కడన్నా అసంతృప్తి వ్యక్తం చేస్తే, ఆ ఫోన్ ఆడియోలు మాత్రం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, పార్టీ వ్యతిరేకి అని ముద్ర వేస్తారు. సర్వే రిపోర్ట్ బాలేదు అని చెప్పిస్తారు. కాబట్టి ఇక్కడ సలహాదారుల తప్పుకూడా ఉంది, వాళ్ళని కూడా సస్పెండ్ చెయ్యాలి అనేది కొంత మంది నాయకుల అభిప్రాయం.

2019 ఎన్నికల ముందు జగన్ ని దారుణంగా తిట్టి చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చి మొట్టమొదటి సారిగా గెలిచిన ఎమ్మెల్యేలకు ఈ సలహాదారుడి అండ వుంటే మంత్రి పదవులు కూడా వస్తాయి అని మనకి ప్రూవ్ అయ్యింది.. ఇతన్ని ప్రసన్నం చేసుకోకపోతే ఉన్న మంత్రి పదవులు కూడా ఊడతాయి. ఎందుకంటే సర్వే రిపోర్టు తారుమారు అయిపోతుంది.  

చంద్రబాబుకి నచ్చని మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ తమ మంత్రి పదవి కోల్పోయారు. చంద్రబాబు మీద గట్టిగా మాట్లాడితే మంత్రి పదవి ఊడిపోతుంది అని సంకేతాలు బలంగా పంపారు. చంద్రబాబు కోసం పని చేస్తున్న సలహాదారులు పైన చెప్పిన వారి మీద జగన్ కి తప్పుడు సమాచారం ఇచ్చి ఉండొచ్చు!, లేకపోతె అసెంబ్లీ లో ముఖ్యమంత్రి స్వయంగా నా వెనుక గట్టిగా నిలబడింది కొడాలి నాని అధ్యక్షా అని చెప్పినా గాని నాని మంత్రి పదవి తొలగించటంలో ముఖ్య పాత్ర ఎవరు వహించారు? అని ఇప్పుడు జరిగిన అన్ని సంఘటనలను లింక్ అప్ చేసుకుంటున్నారు. 

ఏది ఏమైనా జగన్ తక్షణమే తన సలహాదారుల మీద ప్రత్యేక ద్రుష్టి పెట్టాలని అభిప్రాయపడుతున్నారు.