Advertisement

Advertisement


Home > Politics - Analysis

బీజేపీ దృష్టిలో మెగా స్టార్ ఎలాంటి ప్రముఖుడు ...?

బీజేపీ దృష్టిలో మెగా స్టార్ ఎలాంటి ప్రముఖుడు ...?

బీజేపీ కావొచ్చు, కేంద్ర ప్రభుత్వం కావొచ్చు మెగా స్టార్ చిరంజీవిని ఎలాంటి ప్రముఖుడిగా చూస్తోంది? ఇదిప్పుడు కీలకమైన ప్రశ్న. చర్చనీయాంశమైన విషయం కూడా. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 4న ఏపీలో జ‌ర‌ప‌నున్న ప‌ర్య‌ట‌న‌లో పాల్గొనాలని టాలీవుడ్ అగ్ర న‌టుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని  కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి ఆహ్వానించారు. ఈ నెల 4న ఏపీకి రానున్న మోదీ... ఆజాదీ అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగా భీమ‌వ‌రంలో జ‌ర‌గ‌నున్న మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు 125 జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొంటారు. 

ఇందులో భాగంగా భీమ‌వ‌రంలో అల్లూరి విగ్ర‌హాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీలోని పలువురు ప్రముఖులకు ఆహ్వానం పంపారు. అందులో చిరంజీవి కూడా ఉన్నారు. అల్లూరి సీతారామ‌రాజు 125 జ‌యంతి వేడుక‌లను ఈ నెల 27 నుండి ప్రారంభించారు. వచ్చే నెల 4 వరకు 8 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చిరంజీవికి లేఖ రాశారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం ఏపీలోని కొందరు ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. అందులో భాగంగా చిరంజీవిని పిలిచారు. నిజం చెప్పాలంటే ఆయన ఏపీలోని ప్రముఖుడు కాదు. మెగా స్టార్ గా ఆయన అక్కడ కూడా ప్రముఖుడే. కాదనలేము. కానీ రాష్ట్ర ప్రముఖుల జాబితాలోకి ఆయన చేరడు. వ్యక్తిగతంగా ఆయన తెలంగాణలోని ప్రముఖుడని చెప్పొచ్చు. 

ఎందుకంటే ఆయన హైదరాబాదులో ఉంటున్నాడు కాబట్టి. ఈ విషయంలో ఆయన గురించి పెద్దగా చర్చ అనవసరం. ఆయన్ని రాష్ట్ర ప్రముఖుడిగా ఆహ్వానించలేదు. సినిమా రంగానికి చెందిన ప్రముఖుడిగా ఆహ్వానించారా లేదా రాజకీయ ప్రముఖుడిగా ఆహ్వానించారా అనేది ప్రశ్న. ఆయన మెగా స్టార్ కాబట్టి సినిమా ప్రముఖుడు అనడంలో సందేహం లేదు. కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగుతున్న అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమానికి చిరంజీవి ఎందుకు?

సినిమా రంగంలో అల్లూరి సీతారామరాజు అంటే వెంటనే గుర్తుకు వచ్చే హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఆయన సొంతంగా నిర్మించి నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రం అఖండ విజయం సాధించింది. చిరంజీవికి అలాంటి చరిత్ర లేదు. ఆయన నటించిన హిస్టారికల్ మూవీ సైరా నరసింహా రెడ్డి. దాని మీద అనేక వివాదాలు వచ్చాయి. 

ఇక చిరంజీవికి రాజకీయ నేపథ్యం ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేయడం, ఆయన పార్టీ పద్దెనిమిది సీట్లు సాధించడం, ఆ తరువాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్రంలో మంత్రి కావడం, యూపీఏ అధికారంలోకి రాకపోయేసరికి మెగా స్టార్ కాంగ్రెస్ కు దూరమవడం, ఆ తరువాత రాజకీయాల నుంచి పూర్తిగా విరమించడం, మళ్ళీ సినిమాల్లో బిజీ కావడం .... ఇదంతా తెలిసిన చరిత్రే. తమ్ముడు పెట్టిన జనసేనలో చేరతారని లేదా ఆ పార్టీకి మద్దతు ఇస్తారని కొందరు అనుకున్నారు.

కానీ ఆ పని చేయలేదు. ఈ నేపథ్యంలో చిరుకు ఉన్న సినిమా ఇమేజ్ ను, ఆయన రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని ఆయన్ని మళ్ళీ పొలిటికల్ ట్రాక్ లో పెట్టాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. చిరంజీవిని మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకొస్తామని కొందరు బీజేపీ నాయకులు గతంలో అన్నారు. ఇప్పుడు అల్లూరి జయంతి ఉత్సవాలకు చిరంజీవిని ఆహ్వానించి నెమ్మదిగా బ్రెయిన్ వాష్ చేస్తారేమోనని అనుమానం కలుగుతోంది. అందులోనూ ప్రధాని మోడీ వస్తున్న సందర్భంలో చిరంజీవిని ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదీగాక రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. 

బీజేపీ ఆంధ్రాలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. జనసేన కూడా బీజేపీతో (ఇప్పటివరకు) పొత్తులో ఉంది. సో ....చిరంజీవిని ఆహ్వానించడం వెనుక భారీ పొలిటికల్ ప్లాన్ ఉండొచ్చు. రాజకీయాల్లో ఏదీ కొట్టిపారేయడానికి వీల్లేదు. ఒకవేళ అదే నిజమైతే చిరంజీవి ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో చెప్పలేం. బీజేపీ ప్రలోభాలకు లొంగిపోతాడా? అన్న మాట ప్రకారం రాజకీయాలకు దూరంగా ఉంటాడా? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?