ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు య‌జ‌మాని ఎవ‌రు?

సాక్షి గురించి ఆంధ్ర‌జ్యోతి రోత ప‌త్రిక అని తిడుతూ ఒక వార్త రాసింది. సాక్షి రాసిన ఇసుక దోపిడీకి కౌంట‌ర్‌. చాలా కాలంగా చంద్ర‌బాబు స‌త్య‌వంతుడ‌ని, జ‌గ‌న్ అవినీతిప‌రుడ‌ని ఈనాడు, జ్యోతి రాస్తున్నాయి. అదే…

సాక్షి గురించి ఆంధ్ర‌జ్యోతి రోత ప‌త్రిక అని తిడుతూ ఒక వార్త రాసింది. సాక్షి రాసిన ఇసుక దోపిడీకి కౌంట‌ర్‌. చాలా కాలంగా చంద్ర‌బాబు స‌త్య‌వంతుడ‌ని, జ‌గ‌న్ అవినీతిప‌రుడ‌ని ఈనాడు, జ్యోతి రాస్తున్నాయి. అదే విధంగా వీళ్లు ఏం రాసినా సాక్షి కౌంట‌ర్‌గా వార్త రాస్తుంది. సాక్షి ఏం రాసినా దాని త‌ప్పు ప‌ట్ట‌డానికి లేదు. ఎందుకంటే అది జ‌గ‌న్ సొంత ప‌త్రిక‌. య‌జ‌మానికి వ్య‌తిరేకంగా, విరుద్ధంగా ఏ ప‌త్రికా రాయ‌దు. పాత్రికేయ స్వేచ్ఛ‌, ప్ర‌జా సంక్షేమం ఇవ‌న్నీ య‌జ‌మానికి నొప్పి త‌గ‌ల‌నంత వ‌ర‌కే.

మ‌రి ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు య‌జ‌మాని ఎవ‌రు? చంద్ర‌బాబు కాదు క‌దా! చంద్ర‌బాబే అయితే లోగో పక్క‌న ఆయ‌న ఫొటో వేసి ఏం రాసుకున్నా ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు. ప్ర‌జ‌ల కోసం మాట్లాడే ప‌త్రిక‌లుగా ఇవి రెండూ చెప్పుకుంటాయి కానీ, మోసేది చంద్ర‌బాబు ప‌ల్ల‌కీనే.

ఇసుక దోపిడీపై జ్యోతిలో వ‌చ్చిన వార్త అర్ధ స‌త్యం. అంటే బాబుపై ఈగ వాల‌కుండా సాక్షిపై క‌త్తి దూయ‌డం. ఒక‌టి కాదు, రెండు కాదు అన్ని వార్త‌లూ స‌గం నిజాలే. నిజ‌మే చెబుతారు కానీ, పూర్తిగా చెప్ప‌రు.

ఇసుక వార్త‌ని ఒక‌సారి ప‌రిశీలిద్దాం. సాక్షిలో వ‌చ్చిన ఆరోప‌ణ ఏమంటే చంద్ర‌బాబు ఉచిత ఇసుక పేరుతో ప్ర‌భుత్వ ఆదాయానికి వెయ్యి కోట్లు గండి కొట్టాడ‌ని. అయితే వైసీపీ ప్ర‌భుత్వం ఇసుక‌ని అమ్మ‌డం వ‌ల్ల రూ.730 కోట్ల మేర‌కి ప్ర‌భుత్వానికి ఆదాయం ల‌భించింది. అప్పుడు గ‌వ‌ర్న‌మెంట్‌కి రావాల్సిన డ‌బ్బుని రానివ్వ‌కుండా బాబు బినామీలు రూ.10 వేల కోట్ల ఇసుక‌ని అమ్ముకుని తినేశారు.

సాక్షికి రాయ‌డం స‌రిగా రాదు కాబ‌ట్టి, చేతికందిన రాయి విసిరింది. ఆంధ్ర‌జ్యోతి ఆ రాయిని ఒడిసెల‌లో పెట్టి కొట్టింది. ఇక్క‌డ ఇద్ద‌రూ దొంగ‌లే. ప్ర‌జ‌ల సొమ్ముకి గండి కొట్టిన వాళ్లే.

చంద్ర‌బాబు హ‌యాంలో ఇసుక ఉచితంగా ఏమీ దొర‌క‌లేదు. నాయ‌కులు అమ్ముకున్నారు. ఇది వాస్త‌వం. ప్ర‌భుత్వం అమ్మి వుంటే వెయ్యి కోట్లు కాక‌పోయినా , కొన్ని వంద‌ల కోట్లైనా వ‌చ్చి వుండేవి. నాయ‌కులు అమ్ముకున్న ఇసుక 10 వేల కోట్లు అని సాక్షి ప్ర‌కారం అనుకుందాం.

ఆ త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చి ఇసుక‌ని కాంట్రాక్ట‌ర్ల‌కి ఇచ్చి రూ.730 కోట్ల ఆదాయాన్ని స‌మ‌కూర్చింది. మంచిదే , ప్ర‌భుత్వానికి ఆదాయం వ‌స్తే ఆక్షేప‌ణ అన‌వ‌స‌రం. అస‌లు క‌థ ఆ త‌ర్వాత వుంది. బాబు హ‌యాంలో ఇసుక రేటు త‌క్కువ‌. ఇపుడు ఎక్కువ‌. అది కూడా అంత సులువంగా దొర‌క‌దు. మ‌రి బాబు అనుచ‌రులు ఆ రోజుల్లోనే 10 వేల కోట్ల దందా చేస్తే ఇపుడు ఈ రేట్ల‌కు అది క‌నీసం 30 వేల కోట్ల కుంభ‌కోణం కావాలి. ఎందుకంటే ప్ర‌భుత్వానికి వ‌చ్చింది రూ.730 కోట్లే. మ‌రి ఎవ‌రి దోపిడీ ఎంత‌?  

ఆంధ్ర‌జ్యోతి దొంగ బుద్ధి ఎక్క‌డంటే రూ.10 వేల కోట్ల దందా అబ‌ద్ధ‌మ‌ని, అదే నిజ‌మైతే ఇపుడు దందా విలువెంత అని ప్ర‌శ్నించ‌డంలోనే వుంది. ఎందుకంటే చంద్ర‌బాబు హ‌యాంలో కూడా ప్ర‌భుత్వానికి వంద‌ల కోట్ల న‌ష్టం వ‌చ్చింది. రూ.10 వేల కోట్లు కాక‌పోయినా, రూ.5 వేల కోట్లైనా తినేసింది నిజం, అని ఆంధ్ర‌జ్యోతి ఒప్పుకుని వైసీపీని ప్ర‌శ్నించి వుంటే అది ప్ర‌జ‌ల ప‌త్రికై వుండేది.

ప్ర‌జ‌ల పేరుతో, ప్ర‌జాస్వామ్యం పేరుతో ఒక‌రినొక‌రు రోత అని తిట్టుకుంటూ వుంటే, మ‌ధ్య‌లో ప్ర‌జ‌లు జోక‌ర్లు. చంద్ర‌బాబు లోగో పెట్టుకుని ఆంధ్ర‌జ్యోతి ఏం రాసినా ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు. అది కుద‌ర‌క‌పోతే స‌గం నిజం రాసే పత్రిక‌, దుమ్మున్న చాన‌ల్ అని చెప్పు కుంటే బాగుంటుంది.