తన పాదయాత్ర ఆరంభంలో నారా లోకేష్ చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల అభ్యర్థుల ప్రకటన కూడా చేసేశారు! తను చెప్పిన వారు వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, వారిని గెలిపించాలంటూ కూడా లోకేష్ ప్రకటించేశారు! మరి లోకేష్ ఇంతకీ ఏ హోదాలో ఆ అభ్యర్థిత్వాల ప్రకటన చేశారనే అంశంపై కూడా కాస్త చర్చ జరిగిందప్పుడు!
తెలుగుదేశం పార్టీకి అభ్యర్థుల ప్రకటన చేసేందుకు లోకేష్ కు ఉన్న అర్హతేంటో ఆ పార్టీ ఎప్పుడూ చెప్పలేదు. బహుశా చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి లోకేష్ ఆ అర్హతతోనే అభ్యర్థులను ప్రకటించేసి ఉండాలి! ఇదీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం! చంద్రబాబు నాయుడు కొడుకు అనే అర్హత తప్ప మరే అర్హత లేకుండా లోకేష్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి పెను భారంగా మారాడు. ఎమ్మెల్సీ నామినేషన్ తో ఆయన మంత్రి పదవి తీసుకుని విమర్శలపాలయ్యారు. ఆ పై ఆయన ప్రతిభాపాటవాల సంగతి వేరే చెప్పనక్కర్లేదు.
ఇక తను స్వయంగా ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయిన లోకేష్ ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన చేస్తూ ఉన్నారు! మరి ఈ నాయకత్వం తెలుగుదేశం పార్టీని ఎటు వైపు తీసుకెళ్తుందనేది శేష ప్రశ్న! ఆ సంగతలా ఉంటే.. చిత్తూరు జిల్లాలో ఇలా అభ్యర్థులను పరిచయం చేసేసిన లోకేషుడు ఆ తర్వాత ఆ జోరు తగ్గించారు! ఉమ్మడి అనంతపురం జిల్లా లో ఆయన ఇలాంటి హడావుడి ఏదీ చేయకపోవడం గమనార్హం. ప్రత్యేకించి పుట్టపర్తి జిల్లా పరిధిలో తెలుగుదేశం అభ్యర్థులు ఎవరనే ప్రశ్నను కలిగిన నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిల్లో అభ్యర్థుల గురించి లోకేష్ మాట్లాడలేదు.
అందులో పుట్టపర్తి నియోకవర్గమే ముందు వరసలో ఉంది! ఇక్కడ నుంచి పల్లె రఘునాథరెడ్డి ఇన్ చార్జిగా ఉన్నారనుకోవాలి. అయితే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పల్లెకే టికెట్ ఇస్తారా? అంటే మాత్రం ఇంకా అధికారికంగా చెప్పేవారు లేరు. అందులోనూ ఇక్కడ నుంచి టికెట్ ను వేరే వాళ్లు ఆశిస్తున్నట్టుగా బహిరంగ ప్రకటనలే వచ్చాయి. పుట్టపర్తి నుంచి తమ అనుచరుడు ఒకరిని నిలబెట్టుకోవడానికి జేసీ సోదరులు బాహాటమైన ప్రయత్నాలే చేశారు. పల్లె అభ్యర్థిత్వాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. పల్లెపై తీవ్ర ఆరోపణలు చేశారు. పుట్టపర్తి నుంచి తను చెప్పిన వారిని నిలబెడితేనే గెలుపు అంటూ వ్యాఖ్యానించారు. అందుకు తగ్గట్టుగా పల్లె రఘునాథరెడ్డి కూడా బహిరంగ విమర్శలకు దిగారు. జేసీ లపై విరుచుకుపడ్డాడు. ఇలా పుట్టపర్తి విషయంలో టికెట్ పై ఈ పోటీ ఉంది.
మరోవైపు మాజీ మంత్రి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప చూపు కూడా పుట్టపర్తిపైనే ఉందనే టాక్ ఉండనే ఉంది. గతంలో ఈ నియోజకవర్గ కేంద్రం గోరంట్లగా ఉన్నప్పుడు నిమ్మల ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఆ నేపథ్యంతో ఇప్పుడు తన తనయుల్లో ఒకరిని పుట్టపర్తి నుంచి పోటీ చేయించాలనేది నిమ్మల ప్రయత్నంగా వార్తలు వస్తున్నాయి. అందులోనూ నిమ్మలకు బీసీ కార్డు ఉపయోగపడనుంది. ఇలాంటి నేపథ్యంలో పల్లె అభ్యర్థిత్వాన్ని లోకేష్ ధ్రువీకరించలేదు. లోకేష్ పాదయాత్ర పుట్టపర్తి దాటేసిన తర్వాత పల్లె రఘునాథ రెడ్డి గట్టి హల్చల్ చేసి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో రఘునాథరెడ్డి పుట్టపర్తి నుంచి పోటీ చేస్తాడంటూ స్థానికంగా లోకేష్ ప్రకటించి వెళ్లలేదు!
ఇక పెనుకొండ అభ్యర్థిగా కూడా పార్థసారధే ఉంటారా? అనేది ఇంకో ప్రశ్న. పాదయాత్రలో అయితే పార్థసారధి లోకేష్ పక్కనే నిలబడ్డారు. స్థానికంగా అన్ని ఏర్పాట్లూ చేశారు! అయితే పెనుకొండ విషయంలో కురుబ సామాజికవర్గం నుంచినే ఒక మహిళా అభ్యర్థి టికెట్ తనది అని చెప్పుకుంటూ సాగుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పార్థసారధికి ఇప్పుడు టికెట్ ను ప్రశ్నార్థకం చేస్తూ ఉండవచ్చు. ఇక్కడ కూడా పార్థసారధి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు .. గెలిపించాలంటూ లోకేష్ ప్రకటించకపోవడం గమనార్హం.
మరింత విశేషం ఏమిటంటే.. ధర్మవరంలో చాలా హల్చల్ చేసిన లోకేష్ అక్కడ అభ్యర్థి గురించి ప్రకటన చేయలేదు! ఇక్కడ నుంచి పరిటాల శ్రీరామ్ ఇన్ చార్జిగా ఉన్నారు. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా లోకేష్ ఖరారు చేయలేదు! ఇక్కడ కూడా శ్రీరామ్ కు టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారమూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో లోకేష్ కూడా శ్రీరామ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు.
అభ్యర్థుల ప్రకటన విషయంలో లోకేష్ ఏమీ తగ్గలేదని, అయితే ఇన్ చార్జిలే అభ్యర్థులు అవుతారా? అనే నియోజకవర్గాల్లో మాత్రం ఆయన వ్యూహాత్మకంగా అభ్యర్థుల ప్రకటన చేయడం లేదని స్పష్టం అవుతోంది.