Advertisement

Advertisement


Home > Politics - Gossip

‘సోము’కు చీటీ చించేశారా? కొత్త చీఫ్ ఎవరంటే..?

‘సోము’కు చీటీ చించేశారా? కొత్త చీఫ్ ఎవరంటే..?

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పదవికి గండం వచ్చింది. కొన్ని రోజుల వ్యవధిలో ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవినుంచి తప్పించి.. కొత్త సారథిని నియమించడానికి అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయనకు నేరుగా సమాచారం తెలియజేయడానికే సోము వీర్రాజును హుటాహుటిన శనివారం ఢిల్లీకి పిలిపించినట్లుగా తెలుస్తోంది. 

పవన్ కల్యాణ్ ప్రతిపాదనల మేరకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో ఇంకా ఫైనల్ నిర్ణయానికి రాకపోయినప్పటికీ.. సోము వీర్రాజు వల్ల పార్టీకి నష్టం జరుగుతోందనే ప్రచారం విషయంలో పవన్ చెప్పిన సంగతులను అధిష్టానం నమ్మినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. 

సరిగ్గా ఇదే సమయంలో.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా బిజెపిలో చేరారు. పవన్ ప్రతిపాదనల సంగతి ఎలా ఉన్నా.. కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పనిచేయడానికి, రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి సోము వీర్రాజుకు మార్గనిర్దేశం చేసేందుకే పిలిచారని పుకార్లు వచ్చాయి. అయితే పార్టీలో విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఆయనను పదవినుంచి తప్పిస్తారని తెలుస్తోంది. 

మరి కొత్త చీఫ్ ఎవరు అనే విషయంలో రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. నల్లారి కిరణ్ ఇంకా ఢిల్లీలోనే తిష్టవేసి అమిత్ షా సహా పెద్దలందరినీ కలుస్తున్న నేపథ్యంలో.. ఆయన చేతిలో సారథ్య బాధ్యత పెడతారనే పుకారు కూడా వచ్చింది. అయితే ఆయనకు జాతీయ కార్యదర్శి పదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో కూడా ఆయన సేవలను వాడుకోనున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక నాయకులతో ఢిల్లీ పెద్దలు నిర్వహించిన కీలక సమావేశంలో కిరణ్ కూడా పాల్గొన్నారు. ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించబోతున్నట్టుగా తెలుస్తోంది. 

అయితే సోము వీర్రాజును తప్పించిన తర్వాత.. ఏపీ పార్టీ సారథ్య బాద్యతలను ప్రస్తుత జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేతిలో పెడతారని విశ్వసనీయ సమాచారం. సత్యకుమార్.. సోము వీర్రాజు ఇద్దరూ ఏపీ బిజెపిలో భిన్నధ్రువాలుగానే కొనసాగారు. 

అమరావతి పోరాటానికి మద్దతు తెలియజేయడానికి వెళ్లినప్పుడు సత్యకుమార్ కారుమీద దాడి జరిగితే.. సోము వీర్రాజుస్పందన కూడా అంతంతమాత్రంగానే ఉంది. అయితే సోము వీర్రాజు నాయకత్వం పట్ల రాష్ట్ర నాయకులు చాలా మందిలో అసంతృప్తి ఉంది. దీర్ఘకాలంగా పార్టీలో కొనసాగుతున్న, ఆరెస్సెస్ బంధం కూడా ఉన్న అనేక మంది సీనియర్లు ఇటీవల ఢిల్లీ వెళ్లి సోము నాయకత్వం పట్ల వ్యతిరేకత వెలిబుచ్చి కూడా వచ్చారు. 

పవన్ కల్యాణ్ వెళ్లినప్పుడు కూడా.. సోము నాయకత్వం వల్ల పార్టీ ఎలా నష్టోతుందో చెప్పినట్టుగా వార్తలొచ్చాయి. మొత్తానికి అధిష్ఠానం ఈ రెండురోజుల్లో ఏం మల్లగుల్లాలు పడిందో గానీ.. సోము వీర్రాజును తప్పించి.. ఆ స్థానంలో సత్యకుమార్ ను నియమించబోతున్నట్టుగా తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?