జయప్రద తెలుగు రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారట. ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆమె.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పునరంగేట్రం చేయాలనుకుంటున్నట్టు సన్నిహితులతో చెప్పారు. ప్రస్తుతం బీజేపీలో పునరావాసం గడుపుతున్న ఆమె ఏపీలో ఎంట్రీ ఇస్తారా, తెలంగాణలో బరిలో దిగుతారా అనేది తేలాల్సి ఉంది.
టీడీపీతో పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన జయప్రదకు ఆ పార్టీ రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టి సమాజ్ వాదీ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారామె.
ములాయంతో విభేదించి అమర్ సింగ్ తో కలసి బయటకొచ్చిన జయప్రద.. ఆమధ్య బీజేపీ తరపున కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఎక్కడా వర్కవుట్ కాలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఆమె తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో ఎంట్రీ ఇస్తే..
ప్రస్తుతం ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఒకవేళ ఆమె ఏపీలో ఎంట్రీ ఇవ్వాలనుకుంటే పార్టీ మారాల్సిందే. వైసీపీలో కానీ, టీడీపీలో కానీ చేరాలి.
టీడీపీలో చేరితే కాంపిటీషన్ లేదు కాబట్టి టికెట్ గ్యారెంటీ, వైసీపీలో చేరితే టికెట్ కోసం పోరాడాల్సిందే. ఈ దశలో ఆమె తెలంగాణపై ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణకి ఫిక్స్ అయితే..
తెలంగాణలో బీజేపీ తాడో పేడో తేల్చుకోడానికి రెడీగా ఉంది. సో.. ఆల్రెడీ బీజేపీలోనే ఉన్న జయప్రద, తెలంగాణలో బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆమెకు గెలుపు అవకాశాలుంటాయి. ఆల్రెడీ ఆ దిశగా ఆలోచిస్తున్న జయప్రద, నియోజకవర్గాన్ని కూడా కన్ఫామ్ చేసుకున్నట్టు చెబుతున్నారు.
సికింద్రాబాద్ లోక్ సభకు ప్రస్తుతం కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే దఫా కిషన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు. 2023 ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి షిఫ్ట్ అయితే, ఆ తర్వాత ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జయప్రద సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తారు.
ఇదీ లెక్క. ఈ లెక్కలన్నీ పక్కాగా వేసుకునే జయప్రద ఇలా ఫీలర్లు వదిలారని అంటున్నారు. మొత్తమ్మీద కాస్త లేటుగా అయినా జయప్రద తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు. యూపీ నుంచి వచ్చేసి తెలంగాణ లేదా ఏపీలోనే రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆమె రాజకీయాలు జయప్రదమౌతాయా అనేది పెద్ద ప్రశ్న.