తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో చాలా చిత్రవిచిత్రాలుంటాయి. వేరే పార్టీలో ఉంటూ కూడా తెలుగుదేశం పార్టీలో తమకు టికెట్ ఖాయమంటూ కొంతమంది నేతలు చెప్పుకోగలరు! ఇప్పుడు సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం విషయంలో ఇలాంటి రసకందాయక రాజకీయమే సాగుతూ ఉంది. ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిన వెంటనే ఈయన బీజేపీలో చేరిపోయారు. కాంట్రాక్టరు అయిన వరదాపురం సూరి అధికారం అండ కోసమే కమలం పార్టీలో చేరారనే టాక్ ఉండనే ఉంది.
అయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా ధర్మవరం తెలుగుదేశం టికెట్ మాత్రం తనదేనంటూ ధీమాగా చెప్పుకుంటారట సూరి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి ఆయన తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరి టికెట్ పొందుతారనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ధర్మవరం నియోజకవర్గం విషయంలో తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జిగా పరిటాల ఫ్యామిలీని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. ధర్మవరంలో టీడీపీకి ఎవ్వరూ దిక్కులేని సమయంలో పక్కనే ఉన్న రాప్తాడు నియోజకవర్గం బాధ్యులు అయిన పరిటాల ఫ్యామిలీకి ఈ నియోజకవర్గం బాధ్యతలు కూడా అప్పగించారు.
తెలుగుదేశం పార్టీ చేతిలో అధికారం ఉన్నప్పుడు ధర్మవరం బాధ్యతల కోసం పరిటాల ఫ్యామిలీ చాలా తపించింది. సూరితో వీరికి అలాంటి అప్రకటిత వైరం ఉండనే ఉంది. ఎట్టకేలకూ తెలుగుదేశం పార్టీ చిత్తయ్యాకా, ధర్మవరంలో దిక్కు లేకుండా పోయాకా… వారికి ధర్మవరం బాధ్యతలు అయితే దక్కాయి. అయితే ఇక్కడే చంద్రబాబు ఆట ఇంకా మిగిలే ఉండటం గమనార్హం.
పేరుకు ధర్మవరం బాధ్యతలు పరిటాల కుటుంబం చేతిలో ఉన్నా… వచ్చే ఎన్నికల నాటికి సూరి తిరిగి టికెట్ ను పొందుతారనే టాక్ నడుస్తూ ఉంది. దీన్ని పరిటాల శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోకి ధర్మవరం పరిధిలో ఎవరు చేరినా తనే కండువా వేయాలంటూ ఆయన చెప్పుకుంటున్నారు. సూరిని తెలుగుదేశం పార్టీలోకి రానిచ్చే ప్రసక్తే లేదని ఇలా ఇన్ డైరెక్టుగా శ్రీరామ్ చెప్పుకుంటున్నారు!
కానీ.. చంద్రబాబు ముందు ఈ ఆటలు సాగవని, బీజేపీలోకి చేరిన తెలుగుదేశం నేతల పట్ల చంద్రబాబు చాలా సానుకూలంగా ఉన్నారనేది స్పష్టం అవుతున్న అంశమే. ఇంకా చెప్పాలంటే.. టీడీపీ నుంచి బీజేపీలోకి ఎవ్వరు వెళ్లి ఉన్నా, వారంతా చంద్రబాబుకు ఆదేశాల మేరకే వెళ్లారనే టాక్ కూడా ఉండనే ఉంది. టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యులనే చంద్రబాబు పల్లెత్తు మాట అనలేదు! అలాంటిది వరదాపురం సూరి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వస్తే చంద్రబాబు కాదనరనేది బహిరంగ సత్యం. శ్రీరామ్ తో కాకుండా చంద్రబాబుతో కండువా వేయించుకోగలడు వరదాపురం సూర్యనారాయణ. కాబట్టి శ్రీరామ్ వి ఒట్టి ప్రగల్భాలే కాగలవు.
పార్టీ కోసం ధర్మవరం బాధ్యతలు కొన్నాళ్లు చూసుకున్నారని, అంతిమంగా తను చెప్పిన వారికే టికెట్ అని చంద్రబాబు తేల్చి చెప్పగలరు. చంద్రబాబుకు ఇలాంటి వ్యవహారాల్లో ఎలాంటి మొహమాటాలూ ఉండవనేది ఆయన రాజకీయ చరిత్రే చెబుతోంది. పరిటాల శ్రీరామ్ రాప్తాడు నియోజకవర్గం చూసుకోవాలని, ధర్మవరం వరదాపురం సూరికేఅని చంద్రబాబు తేల్చి చెబితే, అప్పుడు కాస్త అలకబూనడం తప్ప శ్రీరామ్ చేయగలిగింది ఏమీ లేకపోవచ్చు. అయితే గతం నుంచి వరదాపురం సూరితో పరిటాల వాళ్లు వైరిని కొనసాగిస్తూ ఉన్నారు.
ఒకే పార్టీలో ఉన్నప్పుడు కూడా పరస్పరం పడేది కాదు. ధర్మవరంలో పరిటాల బ్యానర్లు లేకుండా చూశాడు వరదాపురం సూరి. ఇలాంటి వైరం ఉండటంతో ఇప్పుడు వరదాపురం సూరిపై పరిటాల శ్రీరామ్ కస్సు మంటున్నారు. అయితే వరదాపురం సూరి ఇప్పటికే చంద్రబాబుకు టచ్లో ఉన్నారనే ప్రచారం ఉంది. చంద్రబాబుతో పలుసార్లు కలిశారని, కావాల్సినంత పార్టీ ఫండ్ ఇవ్వగల సత్తా ఆయనకు ఉందని, దీంతో.. మాజీ ఎమ్మెల్యే కోటాలో ఆయన ను చంద్రబాబు దగ్గరకు తీసుకోవడం ఖాయమనేది లోకల్ టాక్.
ఇక వీరిద్దరిలో ఎవరు బలమైన అభ్యర్థులు అనేది మరో విశ్లేషణ. వాస్తవానికి పరిటాల రవి కానీ, ఆయన కుటుంబీకులు కానీ ధర్మవరంలో ఎప్పుడూ నెగ్గింది లేదు. వారి రాజకీయ కార్యకలాపాలకూ, ఇతర కాండలకూ ధర్మవరం వేదికగా నిలిచినప్పటికీ.. పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గాల పరిధిలోనే వారికి ఉన్న పట్టంతా. ధర్మవరం టౌన్ గతంలో తెలుగుదేశం పార్టీకి బాగా అనుకూలమైన ఊరు. అక్కడ బీసీలు టీడీపీకి అండగా నిలుస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ఎన్నికల సమయానికి పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో తిరిగినా, వరదాపురం సూరి ఉన్నట్టుండి పచ్చకండువా వేసి పోటీ చేసినా.. అంతా కొత్తగానే ఉంటుంది. ఒకవేళ పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తే.. పల్లెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత ఈజీ అవుతుంది. మామూలుగా అయితే రూరల్ లో రెడ్డి ఓటు బ్యాంకులో మామూలుగా కొద్ది మేర టీడీపీ చీల్చుకోవచ్చు. కానీ, పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తే… గ్రామాల్లో బలంగా ఉన్న రెడ్డి సామాజికవర్గం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకు వందకు వందశాతం మొగ్గుతాయి.
అరవై డెబ్బై శాతం పడే ఓట్లు కాస్తా, వంద శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకు పడతాయి శ్రీరామ్ పోటీ చేస్తే. ఇక గత రెండు దశాబ్దాల్లో ధర్మవరం వ్యవహారాల్లో పరిటాల జోక్యం లేదు. వ్యాపార కేంద్రం అయిన పట్టణంలో అలాంటి దందాలు లేవు. ఇప్పుడు మళ్లీ పరిటాల వాళ్ల వ్యవహారం ధర్మవరంలో అంటే స్థానికంగా కూడా అంత సానుకూలత ఉండే అంశం కాదు. అలా కాదన్నా… రాప్తాడులోనే పరిటాల కుటుంబం ఆదరణ కోల్పోయింది. ముందుదాన్ని నిలబెట్టుకుంటే ఆ తర్వాత ఇంకో చోట గురించి మాట్లాడుకోవచ్చు. ఏతావాతా.. ధర్మవరం రాజకీయం ఆసక్తిదాయకంగా మారబోతోంది.