వైసీపీలో ఈ భ‌యాన్ని కాద‌న‌గ‌ల‌రా?

వై నాట్ 175 అని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిన‌దిస్తున్నారు. ఆ దిశ‌గా స‌మ‌రోత్సాహంతో ముందుకు క‌ద‌లాల‌ని త‌న పార్టీ ఎమ్మెల్యేలకు ఆయ‌న దిశానిర్దేశం చేస్తున్నారు. ఇంత వ‌ర‌కూ బాగానే వుంది. అయితే వైసీపీ…

వై నాట్ 175 అని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిన‌దిస్తున్నారు. ఆ దిశ‌గా స‌మ‌రోత్సాహంతో ముందుకు క‌ద‌లాల‌ని త‌న పార్టీ ఎమ్మెల్యేలకు ఆయ‌న దిశానిర్దేశం చేస్తున్నారు. ఇంత వ‌ర‌కూ బాగానే వుంది. అయితే వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల్లో రెండో కోణాన్ని కూడా చూడాల్సిన అవ‌స‌రం వుంది.

ఆ రెండో కోణం ఏంటో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి మాటల్లో.. “టీడీపీ అధికారంలోకి వ‌స్తే మ‌న ప‌రిస్థితి ఏంటో, భ‌విష్య‌త్ ఎలా వుంటుందో ఒక‌సారి ఆలోచించండి” అని ఆయ‌న‌ అన్నారు. బాలినేని కామెంట్స్‌ను అంత సులువుగా కొట్టి పారేయ‌డానికి లేదు. గ‌త ఎన్నిక‌ల్లో 175కు 151 ఎమ్మెల్యేలు, 25కు 22 లోక్‌స‌భ స్థానాలు గెలుచుకున్న వైసీపీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధి ఇలాంటి కామెంట్ రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

వైసీపీ కార్య‌క్ర‌మంలో బాలినేని బ‌హిరంగంగా ఈ ర‌కంగా కామెంట్ చేయ‌డం సాహ‌స‌మే. కానీ ఆయ‌న‌లా బ‌హిరంగంగా మాట్లాడ‌ని వాళ్లు ఉన్నారు. చాలా మంది వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధుల్లో ఇలాంటి అభిప్రాయ‌మే ఉంద‌ని ఖ‌చ్చితంగా చెప్పొచ్చు. అందుకే వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల్లో వేళ్ల‌పై లెక్క పెట్ట‌గ‌లిగేంత మంది మాత్ర‌మే టీడీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మిగిలిన వాళ్లు త‌మ ప‌ని తాము చేసుకెళుతున్నారు.

ఈ రోజు అధికారంలో ఉన్నామ‌ని రెచ్చిపోతే, రేపు పోతే మ‌న ప‌రిస్థితి ఎలా వుంటుందో? ఎందుకొచ్చిన గొడ‌వ ఇదంతా? శ‌త్రు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నామ‌నే త‌లంపుతో మీడియాకు, విమ‌ర్శ‌ల‌కు దూరంగా ఉంటున్న వాళ్లే ఎక్కువ‌. ఇలాంటి వారిలో సీఎం వైఎస్ జ‌గ‌న్ స‌మీప బంధువులైన ప్ర‌జాప్ర‌తినిధులే ఉండ‌డం గ‌మ‌నార్హం. క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, అదే జిల్లా క‌మ‌లాపురం ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి త‌దిత‌రులున్నారు. ఇక సీఎంకు క‌ళ్లు, చెవులు తామే అని ప్ర‌చారం చేసుకుంటూ, భారీగా ల‌బ్ధి పొందిన ఎమ్మెల్యేలు కూడా అస‌లు నోరు మెద‌ప‌డం లేదు.

సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చూస్తే, తిప్పి కొట్ట‌డానికి మంత్రి ఆర్కే రోజా, గుడివాడ అమ‌ర్నాథ్‌, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిల‌తో పాటు మ‌రో ఇద్ద‌రు ముగ్గురు నేత‌లు మాత్ర‌మే ముందుకొస్తుంటారు. మిగిలిన నేత‌లంతా త‌మ‌కెందుకులే అనే ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా దూరంగా వుంటున్నారు.

ఒక‌వేళ టీడీపీ అధికారంలోకి వ‌స్తే… అనే భ‌య‌మే ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొట్టేందుకు దూరం చేసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సీఎం జ‌గ‌న్‌కు ఇలాంటి వాళ్లే క‌రెక్ట్ అని సొంత పార్టీ నేత‌లు అంటున్నారు. ఎందుకంటే జ‌గ‌న్‌కు తియ్య‌ని మాట‌లు చెప్పే వాళ్లు కావాల‌ని, అలాంటి వారికి ఆయ‌న ఏమైనా చేస్తార‌నే విమ‌ర్శ వైసీపీలో వుంది. 

చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేల మ‌న‌సులో గూడు క‌ట్టుకున్న అభిప్రాయాన్నే బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి బ‌య‌ట పెట్టార‌ని, అందుకే తామెందుకు నోరు పారేసుకుని ప్ర‌త్య‌ర్థుల‌కు టార్గెట్ కావాల‌నే ఆలోచ‌న అధికార పార్టీ నేత‌ల నోరు మూయించింది. త‌న పార్టీలో అస‌లేం జ‌రుగుతున్న‌దో జ‌గ‌న్ గుర్తిస్తున్న‌ట్టుగా లేరనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.