వైసీపీలో సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారా? అంటే ఔనని ఆ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగా చెబుతున్నారు. ఒంగోలులో తనపై సొంత పార్టీకి చెందిన పెద్ద నాయకుడు కుట్ర చేస్తున్నాడని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఒకవైపు ఈ షాక్ నుంచి పార్టీ తేరుకోకుండానే, మరో ఎమ్మెల్యే అదే రకమైన అంశాన్ని తెరపైకి తేవడం గమనార్హం.
అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? ఎందుకిలా వరుసగా ఎమ్మెల్యేలే మీడియా ముందుకొచ్చి తమపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, పెద్ద నాయకులు కుట్ర చేస్తున్నారని, ప్రత్యర్థులతో చేతులు కలిపి బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు? తమకంటూ అధిష్టానం, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఉన్నారనే సంగతిని కూడా వైసీపీ ప్రజాప్రతినిధులు మరిచిపో యారా? పార్టీ ప్రజాప్రతినిధులు ఇలా ఎవరికిష్టం వచ్చినట్టు వారు బజారుకెక్కి విమర్శలు చేసుకుంటుంటే… అంతిమంగా దెబ్బతినేదే పార్టీనే అని వైసీపీ పెద్దలు ఎందుకు గుర్తించడం లేదో అర్థం కాదు.
హిందూపురంలో ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్సీ, అసమ్మతి నేతలు బాహాబాహీకి దిగినా ఇంత వరకూ కనీసం పిలిచి మాట్లాడినట్టు మీడియాలో రాలేదు. రెండున్నరేళ్లకు పైగా మంత్రిగా కొనసాగిన బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తనపై పార్టీ నేతలే కుట్రకు పాల్పడుతున్నారనే ఆరోపణ చిన్న విషయం కాదు. ఇప్పుడాయన బాటలోనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పయనిస్తున్నారు.
తనపై కుట్ర చేస్తున్నదెవరో తెలుసనని, పద్ధతి మార్చుకోవాలని బాలినేని సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. కానీ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాత్రం పరోక్షంగా ఆనం రాంనారాయణరెడ్డిపై రాజకీయ దాడికి దిగారు. ఎప్పుడే పార్టీలో ఉంటారో తెలియని రాజకీయ వలస పక్షులంటూ ఆనం రాంనారాయణరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని చోట్ల ఇలాంటి పరిస్థితి వుందో అర్థం కాని పరిస్థితి.
ఒకప్పటిలా పార్టీపై వైఎస్ జగన్‌కు పట్టు తప్పిందేమో అనే అనుమానాలకు ప్రజాప్రతినిధుల బహిరంగ విమర్శలు బలం కలిగిస్తున్నాయి. పరస్పరం విమర్శలు చేసుకుంటుంటే వైసీపీ అధిష్టానం చూస్తూ ఊరుకుంటే మాత్రం రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే ఇప్పటికే గన్నవరం, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, నియోజకవర్గ నాయకులు, అలాగే ఎంపీల మధ్య పరస్పరం ఘాటు విమర్శలు చేసుకోవడం చూశాం.
పార్టీలో క్రమశిక్షణ తప్పుతుందనేందుకు ఇలా ఎన్నైనా ఉదహరించుకోవచ్చు. కుట్రలు జరుగుతున్నాయంటూ మీడియాకెక్కి గోల చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలో, లేక సీఎం జగన్ దృష్టికి తీసుకెళితే వైసీపీకి, ప్రభుత్వానికి మంచిది. లేదంటే కూచున్న కొమ్మను తామే నరుక్కుంటున్నట్టే.