టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి గుండెల్లో నిద్రపోయేలా కొడాలి నాని ప్రసంగం కొనసాగింది. టీ20 మ్యాచ్‌లో అభిమాన ఆటగాడు సిక్సర్లు, ఫోర్లు బాదుతుంటే… ప్రేక్షకులు ఈలలు వేస్తూ ఉత్సాహపరిచినట్టు, తమ అభిమాన నాయకుడు కొడాలి నాని ప్రసంగానికి ఫిదా అయ్యారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపై చెలరేగిపోతుంటే వైసీపీ కేడర్ నుంచే ఏకధాటిగా ఈలలు, చప్పట్లు.
కృష్ణా జిల్లా గుడివాడలో మంగళవారం వైసీపీ ప్లీనరీ సమావేశం జరిగింది. కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబుపై తన మార్క్ ప్రసంగం చేశారు. కొడాలి నాని ప్రసంగం ఎలా సాగిందంటే…
“ఎన్టీఆర్ మా ఆస్తి. మాకోసం పార్టీ పెట్టిన దేవుడు ఎన్టీఆర్. నువ్వెవడివిరా… చంద్రబాబు. అన్నగారికి వెన్నుపోటు పొడిచి పార్టీలాక్కున్న నీచుడు, 420 చంద్రబాబు. చంద్రబాబును, ఆ పార్టీని కూకటి వేళ్లతో పీకి పడేస్తా. వైఎస్ వారసుడిగా మనకు మంచి చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి మనం అండగా నిలవాలి. చావైనా.. బతుకైనా జగన్ వెంటే ఉంటా. ఎన్టీఆర్ వారసుడిగా జగన్ బీసీ, వెనుకబడిన వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చాడు. ఇచ్చామంటే ఇచ్చాం అని కాకుండా కీలక శాఖలను వెనుకబడిన వర్గాలకు ఇచ్చారు.
జగన్‌ను ఎదిరించలేక టీడీపీ మీడియా డిబేట్లు పెడుతుంది. డిబేట్లు పెట్టేవాడు.. మాట్లాడేవాడు హైదరాబాద్‌లోనే ఉంటారు. బద్వేలులో పోటీ చేసే దమ్ము లేదు. నీ కుప్పంలో కనీసం సర్పంచ్‌ను గెలిపించుకునే దమ్ములేదు. కుప్పంలో జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, మున్సిపాల్టీలను గెలిపించుకోలేవు. రేపు నువ్వు గెలవలేదు.
జగన్మోహన్రెడ్డి ప్రభంజనంలో కొట్టుకుపోతావు. ఈ రోజు కొడాలిని గుడివాడలో ఓడిస్తా, జోగి రమేష్‌ను పెడనలో ఓడిస్తా, పేర్ని నానిని బందర్లో ఓడిస్తా , వంశీని గన్నవరంలో ఓడిస్తా అంటున్నావు. నువ్వేమీ పీకలేవు. ముందు నువ్వు కుప్పంలో గెలువు.
దమ్ముంటే టీడీపీ ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయలేదు?. చంద్రబాబు చవట దద్దమ్మ. మమ్మల్ని చంద్రబాబు ఓడిస్తాడట. 2019లో నీ దత్త పుత్రుడిని రెండు చోట్ల తుక్కు తుక్కుగా ఓడించాం. నీ సొంత కుమారుడిని మంగళగిరిలో ఓడించాం. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలోనూ ఓడించి ఈ రాష్ట్ర ప్రజల రుణం, ఎన్టీఆర్ రుణం తీర్చుకునే వ్యక్తి వైఎస్ జగన్.
చంద్రబాబు నీకు దమ్ముంటే గుడివాడకు రా పోటీ చేద్దాం. నన్ను ఓడిస్తే ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్లిపోతా. ఓడించకపోతే పార్టీని పీక్కెళ్లిపోతావా? 2024లో నేను మళ్ళీ గెలుస్తాను” అని కొడాలి నాని అన్నారు. కొడాలి నాని సవాల్‌తో కూడిన ప్రసంగం ఆద్యంతం పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉర్రూతలూగించేలా సాగింది.