తేడా వ‌స్తే.. ప‌వ‌న్ ప‌ని ప‌ట్టేది ప‌చ్చ‌మీడియానే!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబును జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న భుజాల మీద మోస్తూ ఉన్నారు అది ఎందుకంటే.. చాలా మంది ప్యాకేజ్ అంటారు. మ‌రి త‌ను అనుకుంటే రోజుకు రెండు కోట్ల రూపాయ‌ల…

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబును జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న భుజాల మీద మోస్తూ ఉన్నారు అది ఎందుకంటే.. చాలా మంది ప్యాకేజ్ అంటారు. మ‌రి త‌ను అనుకుంటే రోజుకు రెండు కోట్ల రూపాయ‌ల పారితోషికంతో సినిమాలు చేసుకోగ‌ల‌ను అని చెప్పే ప‌వ‌న్ క‌ల్యాణ్ కు చంద్ర‌బాబు నాయుడు ఎంత ప్యాకేజీ ఇస్తున్నాడో కానీ, బాహాటంగానే చంద్ర‌బాబును భుజానికి ఎత్తుకున్నాడు ప‌వ‌న్ క‌ల్యాణ్. 

సుమారు తొమ్మిదేళ్ల నుంచి చంద్ర‌బాబును ప‌వ‌న్ త‌న భుజాల మీద మోస్తూనే ఉన్నాడు! ఈ క్ర‌మంలో త‌ను ఎంత అభాసుపాలైనా కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ వెనుక్కు త‌గ్గ‌డం లేదు. చంద్ర‌బాబు వ్యూహంలో భాగ‌స్వామి కావ‌డం వ‌ల్ల‌నే ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ ప‌రిస్థితి ఇలా ఉంది. రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన ఖ్యాతిని ఆర్జించ‌డం కూడా చంద్ర‌బాబు పుణ్య‌మే. 

గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను క‌మ్యూనిస్టుల‌తో క‌లిపి పోటీ చేయించి ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును ఎంతో కొంత చీల్చే వ్యూహాన్ని చంద్ర‌బాబు నాయుడు అమ‌లు ప‌రిచాడు. అది ఏ మాత్రం ప్ర‌యోజ‌నాన్ని ఇవ్వ‌లేదు. ఇక ఇప్పుడు అందుకు తిరుగు వ్యూహంగా తెలుగుదేశం, జ‌న‌సేన‌లు క‌లిసి పోటీ చేసే వ్యూహాన్ని చంద్ర‌బాబు నాయుడు అమ‌లు ప‌రుస్తూ ఉన్నారు. దీనికి అనుగుణంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌డుచుకుంటూ ఉన్నారు.

మ‌రి ఈ చంద్ర‌బాబు చేత, చంద్ర‌బాబు కోసం, చంద్ర‌బాబు వ‌ల్ల ఆడుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ గీత దాటే అవ‌కాశాలు ఎంత వ‌ర‌కూ ఉంటాయ‌నేది ఒక ప్ర‌శ్న‌! ఏ కార‌ణం చేత అయినా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలుగుదేశంతో పొత్తుతో కాకుండా సోలోగా పోటీ చేయాల‌ని అనుకుంటే.. వాస్త‌వానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అలాంటి ఆలోచ‌న క‌ల‌లో కూడా లేదు. ఇదే విష‌యాన్ని ఆయ‌న చెబుతూనే ఉన్నాడు. ఒంట‌రిగా పోటీ చేయనంటూ ఆయ‌న చెప్పుకుంటున్నాడు. ఒంట‌రిగా పోటీ చేయ‌డం అంటే అది త‌న ఆత్మ‌హ‌త్యాస‌దృశ్య‌మ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నాడు. 

సినిమాల్లో ఎంత‌మందిని అయినా ఒంటి చేత్తే ఇర‌గ‌దీసే ఈ హీరో.. ఒంట‌రి పోటీ మాత్రం త‌న‌తో కాదంటూ బేల‌గా మాట్లాడుతూ ఉన్నాడు. మ‌రి ఈ బేల‌త‌నం వ‌ల్ల ప‌వ‌న్ క‌ల్యాణ్ బాగా చుల‌క‌న అవుతున్నాడు. మ‌రీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ దృష్టిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా చుల‌క‌న అవుతున్నాడు. వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లిసి పోటీ, సంకీర్ణ ప్ర‌భుత్వం అంటూ మాట్లాడి.. మ‌ళ్లీ వెన‌క్కు రాలేన‌ట్టుగా ముందుకు వెళ్తున్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట ల ధోర‌ణి వ‌ల్ల‌.. రేపు ఎన్నిక‌ల్లో తెలుగుదేశం ఇచ్చిన‌న్ని సీట్లు తీసుకుని పోటీ చేయ‌డం మిన‌హా మ‌రే గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. అప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఏకేయ‌డానికి ప‌చ్చ‌మీడియానే ముందు ఉంటుంది.

ఇప్పుడు జ‌గ‌న్ ను ప‌వ‌న్ క‌ల్యాణ్ విప‌రీతంగా ద్వేషిస్తూ ఉన్నాడు. ఈ ద్వేషం వ‌ల్ల మాత్ర‌మే ప‌వ‌న్ అనే వాడు ప‌చ్చ‌మీడియాకు న‌చ్చుతున్నాడు త‌ప్ప‌! అంత‌కు మించి ఆయ‌న‌పై ప‌చ్చ‌మీడియాకు కానీ, ప‌చ్చ పార్టీకి కానీ ఎలాంటి అనురాగం లేదు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబును చిన్న మాట విమ‌ర్శిస్తే అప్పుడు ప‌చ్చ‌మీడియా ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అత‌డి స్థానం ఏమిటో చూపిస్తుంది. ఒక‌వేళ ఎక్కువ సీట్లు కావాల‌ని బెట్టు చేసినా, పాతిక‌, ఇర‌వై కి మించి సీట్ల‌ను కోరినా.. తెలుగుదేశం పార్టీ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు చుక్క‌లు చూపిస్తుంది. చంద్ర‌బాబు ఇచ్చిన సీట్ల‌ను తీసుకుని, చంద్ర‌బాబు చెప్పిన వారిని పోటీ చేయించ‌డం త‌ప్ప ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మ‌రో సీన్ ఉండ‌క‌పోవ‌చ్చు.

ఆ మేర‌కు ఆడ‌క‌పోతే.. అప్పుడు ప‌చ్చ‌వ‌ర్గాలు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అస‌లు రూపం చూపించే అవ‌కాశాలున్నాయి. చంద్ర‌బాబు నాయుడు త‌న చుట్టూ ఉన్న వారిని వాడుకోవ‌డంలో డాక్ట‌రేట్ ఇచ్చినా త‌క్కువే! చంద్ర‌బాబు న‌మ్మించి వేసి వేసే వేటు గురించి ఎన్టీఆర్ ఆక్రోశించారు. ఆయ‌న తోడ‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు అయితే బుక్కే వేశారు. హ‌రికృష్ణ పరిస్థితీ తెలిసిందే!

ఎన్టీఆర్, ద‌గ్గుబాటి, హ‌రికృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ వంటి వాళ్ల‌తో పోలిస్తే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో చంద్ర‌బాబుకు బీరకాయ పీచు అనుబంధం లేదు. సొంత వాళ్ల‌నే గ‌ల్లంతు చేసిన చంద్ర‌బాబుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక లెక్క కాదు.ఈ సంగ‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు తెలియ‌నిది ఏమీ కాక‌పోవ‌చ్చు. చంద్ర‌బాబును సీఎంగా చేసి త‌ను రాజ‌కీయంగా బ‌ల‌ప‌డవ‌చ్చ‌ని ప‌వ‌న్ అనుకోవ‌డం కూడా ఒట్టి భ్ర‌మ‌. ప‌వ‌న్ ను ఎంత వ‌ర‌కూ వాడాలో చంద్ర‌బాబుకు తెలుసు, ప‌చ్చ‌మీడియాకూ తెలుసు! ప‌వ‌న్ తో ప‌ని పూర్త‌యితే .. ఆ త‌ర్వాత శంక‌ర‌గిరి మాన్యాలు ప‌ట్టించ‌డం చంద్ర‌బాబు అండ్ కోకు వెన్న‌తో పెట్టిన విద్య‌! తెలుగుదేశం వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ క‌న్నాన్నాప‌వ‌న్ క‌ల్యాణ్!