ఏపీ సీఎం అంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు భయమా. అది నిజమా. బాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ఆయనే తరచూ చెబుతూ ఉంటారు. తన అనుభవం అంత వయసు జగన్ కి లేదు అని. తాను ముమ్మారు సీఎం గా మరో ముమ్మారు విపక్ష నేతగా ఉన్నానని గొప్పగా చాటుకుంటారు. తనకు ఎవరూ పోటీ సరిసాటి లేరని రారని కూడా బాబు అంటూంటారు.
అటువంటి బాబుకు జగన్ అంటే భయం అని అంటున్నారు యువ మంత్రి గుడివాడ అమరనాధ్. జగన్ అత్యంత శక్తివంతుడు అన్న సంగతి బాబుకు తెలిసే ఒంటరిగా పోటీ చేయడానికి భయపడుతున్నారని గుడివాడ తనదైన శైలిలో విశ్లేషించారు. ఏపీలో జగన్ బలం ఏంటి అన్నది విపక్షాలు పొత్తులకు వెంపర్లాడడం బట్టి చూస్తేనే అర్ధం అవుతుందని అన్నారు. వైసీపీని ఓడించేందుకు అన్ని పార్టీలు కలసికట్టుగా రావడం అంటే అర్ధమేంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
జగన్ని నిలువరించలేమని బాబు సహా విపక్షాలకు తెలుసు అన్నారు. అయినా సరే గెలుస్తామని అంటున్నారని గుడివాడ ఎద్దేవా చేశారు. పొత్తులు ఎన్ని పార్టీలు పెట్టుకున్నా వైసీపీదే విజయం అని ఆయన ధీమాగా చెబుతున్నారు. పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలు దాన్ని మరో మారు రుజువు చేశాయని అన్నారు.
మెజారిటీ సీట్లను వైసీపీ గెలిస్తే పక్కన పెట్టి టీడీపీ కొన్ని సీట్లు గెలిస్తే ఎల్లో మీడియా బ్యానర్ హెడ్డింగ్స్ పెట్టి రాస్తున్నాయని అక్కడికి అదే గొప్ప విజయం అని భావిస్తూ టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని గుడివాడ సెటైర్లు పెల్చారు.
టీడీపీ దానికి బాకా ఊదే పత్రికల ఆనందాన్ని తాము కాదనడంలేదని, అలాగే ఎంజాయ్ చేసుకోవచ్చు అని ఆయన వెటకారం చేశారు. 2024లో మళ్లీ వైసీపీ గెలుస్తుందని ఇది కూడా గుర్తు పెట్టుకోవాలని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు అందరి తోకలు కట్ చేస్తాను, వచ్చేది నేనే సీఎం గానే ఏపీ అసెంబ్లీలో అడుగు పెడతాను అని అంటూంటే ఆయనకు ఒంటరి పోరు భయమని, జగన్ అంటే జడుపు అని యువ మంత్రి వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన మాటల్లో లాజిక్ అయితే ఉంది. అందరూ ఒక్కటిగా వస్తున్నారు అంటే ప్రత్యర్ధి కడు బలవంతుడు అని చెప్పకనే చెబుతున్నట్లే లెక్క కదా అంటున్నారు.