బీజేపీలో ఇటు పదవులు అటు రాజీనామాలు

బీజేపీకి విశాఖలో కొంత బలం ఉంది. జనసంఘ్ పార్టీ బీజేపీగా రూపాంతరం చెందాక 1980 ప్రాంతంలో సౌతిండియాలోనే తొలి కార్పోరేషన్ గా విశాఖను బీజేపీ గెలుచుకుంది. ఆ సంప్రదాయ ఓటుతో పాటు కొంత బలం…

బీజేపీకి విశాఖలో కొంత బలం ఉంది. జనసంఘ్ పార్టీ బీజేపీగా రూపాంతరం చెందాక 1980 ప్రాంతంలో సౌతిండియాలోనే తొలి కార్పోరేషన్ గా విశాఖను బీజేపీ గెలుచుకుంది. ఆ సంప్రదాయ ఓటుతో పాటు కొంత బలం అల బీజేపీని విశాఖలో నిలబెడుతోంది.

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి వచ్చారు. ఆమె రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. విశాఖ నుంచి నలుగురికి స్థానం కల్పించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ లకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పదవులు దక్కాయి. సాగి కాశీవిశ్వనాధరాజుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. మరో కీలక పదవి విశాఖకు చెందిన నాగేంద్రకు లభించింది. విశాఖకు పెద్ద పీట వేస్తూ పదవుల పంపిణీ పూర్తి చేసిన తరుణంలో మరో వైపు బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఆ పార్టీ ఉత్తరాంధ్రా ఎస్సీ మోర్చా జోనల్ ఇంచార్జి మంచా నాగమల్లీశ్వరి ప్రకటించి షాక్ ఇచ్చారు.

బీజేపీలో క్రింది స్థాయి నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత లేదని ఆమె ఆరోపించడం విశేషం. దళితులకు మహిళలకు బీజేపీలో అసలు న్యాయం జరగడం లేదని ఆమె ఘాటైన విమర్శలే చేశారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేశాను అని ఆమె పేర్కొన్నారు.

బీజేపీ వచ్చే ఎన్నికల్లో విశాఖ మీద ఎక్కువగా ఆశపడుతోంది. అందుకే రాష్ట్ర స్థాయి పార్టీ పదవులలో విశాఖ వారికే అగ్ర తాంబూలం ఇస్తోంది. ఈ పరిస్థితిల్లో మహిళ, దళిత సామాజికవర్గం నేత పార్టీలో న్యాయం జరగడంలేదు అంటూ రాజీనామా చేయడం గట్టి దెబ్బేనని అంటున్నారు. బీజేపీలో ఎపుడూ ఉన్న కొంతమందికే పదవులు ఇస్తున్నారని, కొత్త రక్తాన్ని ఎందుకు ప్రోత్సహించడం లేదు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీని మీద కాషాయం నేతలు ఏమంటారో.