జ‌గ‌న్‌ను స్వాగ‌తిస్తున్న‌ ‘ఆంధ్ర‌జ్యోతి’

ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు….ఆంధ్ర‌జ్యోతిలో జ‌గ‌న్‌పై ఓ నిష్పాక్షిక అభిప్రాయాన్నిచూడ‌డం. నిజంగా ఈ అక్ష‌రాలు ఆంధ్ర‌జ్యోతివేనా? ఒక‌టికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి. అవును నిజ‌మే, ఆంధ్ర‌జ్యోతిలో రాసిన‌వే. Advertisement రాజ‌ధానిపై అధ్య‌య‌నానికి వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్…

ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు….ఆంధ్ర‌జ్యోతిలో జ‌గ‌న్‌పై ఓ నిష్పాక్షిక అభిప్రాయాన్నిచూడ‌డం. నిజంగా ఈ అక్ష‌రాలు ఆంధ్ర‌జ్యోతివేనా? ఒక‌టికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి. అవును నిజ‌మే, ఆంధ్ర‌జ్యోతిలో రాసిన‌వే.

రాజ‌ధానిపై అధ్య‌య‌నానికి వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్ రెండు నెల‌ల క్రితం జీఎన్ రావు కమిటీని ఏర్పాటు చేసింది. ఆ క‌మిటీ అనేక సిఫార్సుల‌తో కూడిన నివేదిక‌ను సీఎం జ‌గ‌న్‌కు శుక్ర‌వారం సాయంత్రం నివేదిక స‌మ‌ర్పించింది. అసెంబ్లీలో రాజ‌ధానిపై జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌, జీఎన్ రావు క‌మిటీ సిఫార్సులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా జ‌గ‌న్‌కు అండ‌గా నిలుస్తూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. దీనిపై ఆంధ్ర‌జ్యోతి వెబ్‌లో ‘జగన్ 3 రాజధానుల ప్రకటనపై ‘అన్నయ్య’ అలా.. ‘తమ్ముడు’ ఇలా..!’ శీర్షిక‌తో క‌థ‌నాన్ని పెట్టారు.

ఆ క‌థ‌నంలో  ‘ఏపీ సీఎం వైఎస్ జగన్  రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చేమోనేనని అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనను.. చాలా వరకు స్వాగతించగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందిన నేతలు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు టీడీపీకి చెందిన కొందరు ముఖ్యులు, కీలక నేతలు స్వాగతించారు’  అని రాశారు.

జ‌గ‌న్ ఏం చేసినా త‌ప్పు అని రాసే, చూపే ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్‌….ఆశ్చ‌ర్య‌క‌రంగా జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌ను చాలా వ‌ర‌కు స్వాగ‌తించార‌ని, చంద్ర‌బాబుతో పాటు టీడీపీకి చెందిన నేత‌లు వ్య‌తిరేకిస్తున్నార‌ని పేర్కొన‌డం నిజంగా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అలాగే టీడీపీకి చెందిన ముఖ్యులు, కీల‌క నేత‌లు స్వాగ‌తించార‌ని ఆంధ్ర‌జ్యోతి ఆర్‌కే తేల్చేశారు.

ఈ రాత‌లు చ‌దివితే చంద్ర‌బాబు ఏమైపోవాలి? చ‌ంద్ర‌బాబు న‌మ్ముకున్న ఏకైక మీడియా అధిప‌తి ఆర్‌కే కూడా పార్టీ ఫిరాయిస్తున్నారా? ఏమో రెండు నెల‌ల క్రితం అమిత్‌షాను క‌లిసి వచ్చిన ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్‌కే…ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జ‌గ‌న్‌తో మాత్రం రాజీప‌డ‌డ‌నే న‌మ్మ‌కం ఏంటి? అందులో భాగ‌మేనా ఈ ‘స్వాగ‌త’ వ‌చ‌నాలు.