జ‌గ‌న్ క్రేజ్ పెంచిన‌ ఆంధ్ర‌జ్యోతి

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ క్రేజ్ పెంచేలా ఆంధ్ర‌జ్యోతి ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. చంద్ర‌బాబు కంటే ఎక్కువ‌గా జ‌గ‌న్‌ను ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్కే ద్వేషిస్తున్న సంగ‌తి తెలిసిందే. మీడియా సంస్థ‌గా ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ అన్ని హ‌ద్దుల‌ను…

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ క్రేజ్ పెంచేలా ఆంధ్ర‌జ్యోతి ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. చంద్ర‌బాబు కంటే ఎక్కువ‌గా జ‌గ‌న్‌ను ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్కే ద్వేషిస్తున్న సంగ‌తి తెలిసిందే. మీడియా సంస్థ‌గా ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ అన్ని హ‌ద్దుల‌ను దాటి ప్ర‌వ‌ర్తిస్తునేందుకు అనేక ఉదాహ‌ర‌ణ‌లు చెప్పుకోవ‌చ్చు. ఇదే క్ర‌మంలో జ‌గ‌న్‌ను బ‌ద్నాం చేయాల‌నే త‌లంపుతో క‌థ‌నం రాసిన‌ప్ప‌టికీ, అది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య‌మంత్రి ప‌ర‌ప‌తిని పెంచుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

“జగన్‌ మూర్ఖుడు!” అనే శీర్షిక‌తో ఆంధ్ర‌జ్యోతిలో క‌థ‌నం ప్ర‌చురించారు. జ‌గ‌న్ సార‌థ్యంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అక్ర‌మ ప్రాజెక్టులను నిర్మిస్తూ తెలంగాణ నీటిని కూడా ఎత్తుకెళుతోంద‌ని, దానిపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిప‌డుతున్నార‌నేది ఆ క‌థ‌నం సారాంశం. ఈ క‌థ‌నం ప్ర‌కారం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై తెలంగాణ‌లో వ్య‌తిరేక‌త వ‌చ్చే రావ‌చ్చు. 

ఇదే స‌మ‌యంలో త‌మ రాష్ట్రం కోసం ప్రాజెక్టుల‌ను నిర్మిస్తూ, తెలంగాణ అభ్యంత‌రాల‌ను లెక్క చేయ‌కుండా నీటిని త‌ర‌లిస్తున్న పాల‌కుడిగా ఏపీలో త‌ప్ప‌కుండా జ‌గ‌న్‌పై ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ‌తో జ‌గ‌న్‌కు వ్య‌క్తిగ‌త గొడ‌వ లేదు. త‌న రాష్ట్రం కోసం తెలంగాణ కేసీఆర్‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగిన ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌ను ఆ రాష్ట్ర ప్ర‌జానీకం త‌ప్ప‌క గుర్తిస్తుంది, గౌర‌విస్తుంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేపట్టిన రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం, రాజోలి బండ మ‌ళ్లింపు ప‌థ‌కం (ఆర్డీఎస్‌) కుడి కాల్వ నిర్మాణాలు అక్ర‌మ‌మైన‌వ‌ని తెలంగాణ మంత్రి మండ‌లి తీవ్రంగా నిర‌సించింది. సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న శ‌నివారం తెలంగాణ మంత్రి మండ‌లి స‌మావేశం ఏపీ ప్రాజెక్టుల అంశంపై సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించిన‌ట్టు ఆంధ్ర‌జ్యోతి రాత‌లేంటో చూద్దాం.

“ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నారు. మూర్ఖత్వంలో జగన్‌ తన తండ్రి రాజశేఖర్‌రెడ్డిని మించి పోయారు. కృష్ణా బేసిన్‌లో ఏపీ సర్కారు అక్రమ ప్రాజెక్టులు చేపడుతున్నది. తెలంగాణకు అన్యాయం చేసే విషయంలో నాటి ఉమ్మడి ఏపీ సీఎం రాజశేఖర్‌రెడ్డి కంటే మూర్ఖంగా జగన్‌ ముందుకెళ్తున్నారు. 

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌కు చట్టాలపై ఏమాత్రం గౌరవం లేదు. అక్రమ ప్రాజెక్టులే అందుకు నిదర్శనం. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీళ్లను ఎత్తుకుపోతున్నారు. దీనిపై మౌనంగా ఉంటే తప్పు చేసినట్లవుతుంది. ఏపీ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేయాల్సిందే. ఎక్కడివరకైనా పోరాటం చేద్దాం” అని అన్న‌ట్టు రాసుకొచ్చారు.

జ‌గ‌న‌పై కేసీఆర్‌కు, ఆర్కేకు కోపం ఉండొచ్చు. కానీ జ‌గ‌న్‌కు కావాల్సింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ఆశీస్సులు. అవే ఆయ‌న్ను ప‌దికాలాల పాటు ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉండ‌డానికి దోహ‌దం చేస్తాయి. ఆంధ్ర‌జ్యోతి క‌థ‌నం ప్ర‌కారం తీసుకుంటే దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కంటే ఎక్కువ‌గా ఏపీకి సాగునీళ్లు అందించేందుకు తెలంగాణ‌తో ఘ‌ర్ష‌ణ ప‌డుతున్నారు.

స‌హ‌జంగానే ఈ ప్ర‌చారం జ‌గ‌న్‌పై ఏపీలో పాజిటివిటీ పెంచుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కోరుకుంటున్న‌ది కూడా ఇదే. జ‌గ‌న్ ప‌ర‌ప‌తి పెంచేలా ఆంధ్ర‌జ్యోతి క‌థ‌నం ఉంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌గ‌న్ మూర్ఖుడ‌ని కేసీఆర్ అన్నంత మాత్రాన ముఖ్య‌మంత్రికి పోయేదేమీ లేదు.

ఎందుకంటే కేసీఆర్ పొగిడితేనే స‌మ‌స్య‌. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం మిత్రుడైన కేసీఆర్‌ను సైతం లెక్క చేయ‌ని సీఎంగా జ‌గ‌న్ త‌ప్ప‌క ప్ర‌జాద‌ర‌ణ పెంచుకుంటార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆంధ్ర‌జ్యోతి కీడు చేయ‌బోయి జ‌గ‌న్‌కు మేలు చేయ‌డం అంటే ఇదే కాబోలు.