రాజకీయ పార్టీ అనేది ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పోరాడాలి, పాటుపడాలి. ప్రజలకు ఆ పార్టీకి అధికారం కట్టబెడుతున్నారా? లేదా? అనే సంగతి తరువాత.. కానీ ప్రజలకోసం పనిచేయడం మాత్రం మానకూడదు.
ఇప్పటికే అనేకానేక పార్టీలతో పొత్తులు, స్నేహాలు నెరపి చాలా అనుభవం గడించిన జనసేనాని పవన్ కల్యాణ్.. కమ్యూనిస్టులతో పొత్తు సమయంలో ఈ సత్యాన్ని నేర్చుకుని ఉండాలి కూడా. ఎందుకంటే కమ్యూనిస్టులు రాష్ట్రంలో ఎప్పుడూ గెలవకపోయినా సరే.. ప్రజాసమస్యల విషయంలో స్పందిస్తూనే ఉంటారు. ఆందోళనలు చేస్తూనే ఉంటారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. కానీ.. జనసేనాని పవన్ కల్యాణ్ తీరును గమనిస్తే మాత్రం.. ఆయన ఆదినుంచి ప్రతి వ్యవహారాన్నీ క్విడ్ ప్రోకో దృక్పథంతోనే చూస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఏ ఊరిలో ఏ ప్రసంగాన్నయినా గమనించండి.. నేను మీకోసం ఏదైనా పనిచేయాలంటే.. ముందు మీరు నాకోసం ఏం చేస్తారు? అనే ధోరణిలోనే పవన్ మాటలు ఉంటున్నాయి. మీరు నన్ను ముఖ్యమంత్రిని చేయండి.. మీ జీవితాలను నేను బాగుచేసేస్తాను.. అనేది ఆయన పాపులర్ నినాదం. రేప్పొద్దున్న పవన్ కల్యాణ్ ను ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించినా సరే.. ఆయన చేతగానితనం వల్ల, అసమర్థ పార్టీ నిర్వహణ వల్ల ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయినట్లయితే.. అప్పుడు మళ్లీ పవన్ కల్యాణ్ ప్రజలనే నిందిస్తారు. నన్ను మీరు ముఖ్యమంత్రిని చేయలేకపోయారు. మీకోసం నేను జస్ట్ ఎమ్మెల్యేగా ఉంటూ ఏమీ చేయలేకపోతున్నాను అని బుకాయించినా బుకాయించగలరు.
2014 ఎన్నికల్లో చంద్రబాబు పల్లకీ మోయడంలో సక్సెస్ అయిన పవన్, తర్వాత ప్రజల నుంచి మొహం చాటేశారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యపై మాత్రం కాస్త స్పందించారు. 2019లో ఒంటరిగా పోటీచేయాలనుకున్న తర్వాత.. కాస్త ప్రజల్లో తిరిగారు. ప్రజలు దారుణంగా ఛీత్కరించి, ఓడించిన తర్వాత.. మళ్లీ కనుమరుగైపోయారు. ఎప్పుడో షూటింగ్ గ్యాప్ లలో వచ్చి, మీరు నన్ను ఓడించినా సరే నేను పారిపోలేదు అని నంగనాచి కబుర్లు చెబుతుంటారు.
తీరా ఇప్పుడు వారాహి యాత్ర మొదలు పెట్టిన తర్వాత.. నన్ను ఆరోజు గాజువాక ఎమ్మెల్యేగా గెలిపించి ఉంటే.. విశాఖ అరాచకాలను అడ్డుకుని ఉండేవాడిని అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. మరి ఇన్నాళ్లూ ‘మీరు నన్ను ఓడించినా సరే.. నేను పారిపోలేదు’ అని చెప్పిన మాటలు ఏమయ్యాయి? ఓడించినా సరే.. విశాఖ అరాచకకాలకు అడ్డుపడి ఉండొచ్చు కదా అనేది ప్రజల ప్రశ్న.
ప్రతి సందర్భంలోనూ, జనసమూహాన్ని కలిసిన ప్రతి సమయంలోనూ ‘‘మీరు నన్ను సీఎం చేయండి.. నేను మీ కష్టాలు తీరుస్తా..’’ అనే పడికట్టు డైలాగు పవన్ కు అలవాటు అయిపోయింది. కాపులను కలిసినా, ఉప్పుటేరు మీద వెళ్లి మత్స్య కార్మికులను కలిసినా, తాజాగా ముస్లిములను కలిసినా.. అందరితోనూ ఒకటే మాట.. మీరు నాకు అధికారమిస్తే.. నేను మీకోసం పనిచేస్తా..? అనే అంటున్నారు.
ఈ మాటలు ఎంత చవకబారు క్విడ్ ప్రోకో డీల్ లాగా కనిపిస్తున్నాయో పవన్ కల్యాణ్ కు అర్థమవుతున్నట్టు లేదు. ఆయన ప్రసంగాల రూపకర్తలు ఈ మాటలు చేసే చేటును గుర్తిస్తున్నట్టు లేదు. పవన్ ప్రతి మాటలోనూ ఇండైరక్టుగా.. నా పార్టీని ఓడిస్తే.. మళ్లీ మీ మొహం కూడా చూడను అనే అర్థం కూడా ధ్వనిస్తుంటుంది.
ఇలాంటి అవకాశవాద నాయకుడిని ఎందుకు నమ్మాలని, కాస్త ఆలోచన పరులైన ప్రజలు అనుకుంటే తన పార్టీకి ఎంత నష్టమో పవన్ తెలుసుకోవడం లేదు.