వైసీపీ ప్రభుత్వం రైతుల్ని విస్మరించిందట, తాము అండగా నిలుస్తారట! ఇది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెబుతున్న మాట. చంద్రబాబు అంటే రైతు వ్యతిరేకానికి పర్యాయ పేరుగా చెబుతారు.
అలాంటి నాయకుడు నాయకత్వం వహించే పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైఎస్ జగన్ మూడేళ్ల పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు.
పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేదని, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రెండోస్థానంలో ఉందని ఆరోపించారు. రైతాంగ దుస్థితిని దృష్టిలో పెట్టుకుని వారికి అండగా నిలిచేందుకు తమ పార్టీ ఆధ్వర్యంలో “రైతు కోసం తెలుగుదేశం” పేరుతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రాంతాల్లో ఈ కమిటీ పర్యటించి రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతుందన్నారు. ఇదిలా ఉండగా గతంలో రైతుల రుణాలన్నీ, అలాగే బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారాన్ని కూడా విడిపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి, విస్మరించిన సంగతిని ప్రజలు మరిచిపోయారని అచ్చెన్నాయుడు అనుకుంటున్నారని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. కనీసం సగం రుణాల్ని కూడా చంద్రబాబు మాఫీ చేయని సంగతి తెలిసిందే.
ఇక బాబు వస్తే, బ్యాంకుల నుంచి బంగారం వస్తుందని ఆశించిన రైతాంగానికి తీవ్ర నిరాశ తప్పలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమికి రైతాంగ ఆగ్రహమే కారణమని టీడీపీ గుర్తించినట్టు లేదు.
తగదునమ్మా అని ఇప్పుడు రైతు కోసం అంటూ తెలుగుదేశం వెళ్లాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల్ని ముంచేందుకే తెలుగుదేశం అని పేరు మార్చుకుంటే బాగుంటుందని వెటకరించే వాళ్లు లేకపోలేదు.