రాజద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ చట్టం కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటని సుప్రీంకోర్టు నిలదీసింది. చట్టాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోంది.
కొందరు రాజద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై కేసు నమోదు చేయకపోతే ఎట్లా అని నేరుగా సర్వోన్నత ధర్మాసనం ఎదుటే కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదన వినిపించారు.
అయితే చట్టంపై సమీక్షిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో, అంత వరకూ రాజద్రోహం కేసుల నమోదుపై స్టే విధిస్తు న్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియా ముందు కొచ్చారు.
రాజద్రోహం చట్టం కొనసాగింపుపై సానుకూల ధోరణితో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే దమ్ము, ధైర్యం మాత్రం రఘురామకు లేవు. ఇదే ఏపీ సర్కార్‌ను విమర్శించడానికి మాత్రం ఎక్కడెక్కడి నుంచో ధైర్యం పుట్టుకొస్తుంది.
రాజద్రోహం కేసుపై సుప్రీంకోర్టు స్టే విధించాలనే నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని రఘురామ అన్నారు. తనపై రాజద్రోహం కేసు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అలాగే మీడియా, ఇతరులపై కూడా రాజద్రోహం కేసు పెట్టారన్నారు. కొందరిపై రాజద్రోహం కేసు పెట్టి దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
నిజమే కానీ, మరి రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయడానికి ససేమిరా అంటున్న కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టా? కాదా? అనేది మాత్రం రఘురామ చెప్పరు గాక చెప్పరు. ఆ మాట అంటే సీబీఐ, ఈడీ తదితర వ్యవస్థల్ని ఉసిగొల్పుతారనే భయం.