ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సీరియస్‌గా కామెడీ పండించడంలో రోజురోజుకూ రాటుదేలుతున్నారు. ఈ విద్యలో సోము వీర్రాజు తనకు తానే సాటి అని చెప్పక తప్పదు. టీడీపీపై ఆయన రగిలిపోతున్నారు. జనసేన పవన్‌కల్యాణ్‌ను ఆయనలా అర్థం చేసుకున్న మహానుభావుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో! పవన్‌కల్యాణ్ మాటలకు అర్థాలే వేరులే అనుకుంటే, ఆయనకు మించిపోయేలా వీర్రాజు తయారయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ, జనసేన పొత్తుపై వీర్రాజు అద్భుతమైన వివరణ ఇచ్చారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సమాధానాలు వింటున్న వాళ్లెవరికైనా నవ్వు ఆపుకోవడం సాధ్యం కాదు. బీజేపీ, జనసేన పొత్తు విషయంలో క్లారిటీ తప్పినట్టు కనిపిస్తోందని మీడియా ప్రతినిధి ప్రశ్నకు… “మేము క్లారిటీగానే ఉన్నాం. మీరు కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. కొందరు కన్ఫ్యూజన్‌లో ఉన్నట్టు మాకు స్పష్టత వుంది” అని వీర్రాజు సీరియస్‌గా సమాధానం ఇచ్చారు.
ఇంతటితో కామెడీ సీన్ అయిపోలేదు. పవన్‌కల్యాణ్ అన్ని పార్టీలు కలిసి రావాలని కోరుతున్నారు, మీరేమో జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నామని చెబుతుండడంపై ఏమంటారనే ప్రశ్నకు…. మిగిలిన రాష్ట్రాల్లో మాదిరిగానే మన రాష్ట్రంలో కూడా కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ముందుకెళ్లాలనేది పవన్‌కల్యాణ్ భావనగా అర్థం చేసుకున్నానని సమాధానం ఇచ్చారు. అన్నట్టు పవన్‌కల్యాణ్ తెలుగులోనే కదా తన భావనను స్పష్టంగా చెప్పింది. తెలుగును తెలుగులోకి తర్జుమా చేసుకుంటే వీర్రాజు మాటలవుతాయోమో మరి!
వీర్రాజు ఇంకా ఏమన్నారో చూద్దాం.
మీరు, జనసేన, అలాగే టీడీపీ వేర్వేరుగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఎలా వుంటుందనే ప్రశ్నకు సోము వీర్రాజు అద్భుతహః అనే రీతిలో సమాధానం ఇచ్చారు. ఆయన (పవన్) ఏ పార్టీ పేరు ప్రస్తావించలేదన్నారు. ఇంకొక పార్టీ పేరు ఉచ్చరించలేదన్నారు. పవన్ ఉచ్చరించినపుడు దాని గురించి ఆలోచిద్దామన్నారు. వారు మాట్లాడిన తర్వాత స్పందిద్దామని స్పష్టత ఇచ్చారు. పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలను మీడియా, రాజకీయ విశ్లేషకులు, సమాజం సరిగా అర్థం చేసుకోలేదని వీర్రాజు అభిప్రాయాలు విన్న తర్వాత అర్థమవుతుంది.
జనసేన, బీజేపీ పొత్తుతో వైసీపీని ఓడించగలుగుతారా? అంటే… వందశాతం అని సోము వీర్రాజు జవాబు విన్న తర్వాత నవ్వుకోకుండా ఎవరైనా ఉండగలరా? కేఏ పాల్‌ను మించిపోయిన వాళ్లుంటే, ఎందుకని అందరూ ఆయన్ని మాత్రమే కమెడియన్‌లా చూస్తున్నారో అర్థమే కాదబ్బా!