ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ డిజైన్లలో భారీ భూదోపిడీకి పాల్పడ్డారంటూ ఏపీ సీఐడీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలను కూడా ప్రభుత్వం ఇరికించాలని అనుకుంటోందా? అంటే… ఔనని టీడీపీ నేతలు సమాధానం ఇస్తున్నారు.
జగన్ ప్రభుత్వం ఈ కేసులో చంద్రబాబు కుటుంబ సభ్యులను ఇరికించే క్రమంలో హెరిటేజ్ కంపెనీ పేరు చేర్చినట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ భయాన్ని, అనుమానాన్ని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు వెల్లడించారు. మీడియాతో నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని అక్రమ కేసుల్లో ఇరికించి శునకానందం పొందాలని వైసీపీ ప్రభుత్వం అనుకుంటోందని విమర్శించారు.
ఇప్పటికే నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు వ్యక్తిగతంగా దూషించి ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు భువనేశ్వరి, బ్రాహ్మణిలను అక్రమ కేసులో ఇరికించేందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హెరిటేజ్ ఫుడ్స్‌ని చేర్చారని నక్కా ఆనంద్‌బాబు టీడీపీ అంతరంగాన్ని బయట పెట్టారు.
మంగళగిరిలో లోకేశ్‌కు వస్తున్న ప్రజాధరణ చూసి తట్టుకేలేక ఎమ్మెల్యే ఆర్కే చంద్రబాబు కుటుంబసభ్యులపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. గతంలో రాజధానిలో అక్రమాలంటూ కొండని తవ్వి ఎలుక తోక కూడా పట్టుకోలేదని వెటకరించారు.
ఇప్పుడు కూడా మరోసారి ప్రజావ్యతిరేకత ఎదుర్కోవటం తప్ప ఏం చేయలేరని ఆయన తేల్చి చెప్పారు. టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను కనీసం ఒక్కరోజు కూడా జైల్లో పెట్టకపోవడంతో జగన్ ప్రభుత్వం తమనేం చేయలేదనే ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.
జగన్ ప్రభుత్వం కేవలం కేసుల నమోదు వరకే పరిమితం కావాలి తప్ప, అంతకు మించి చర్యలు తీసుకునే పరిస్థితి లేదని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వారు చెబుతున్నట్టే జరుగుతోంది కూడా. రింగ్‌రోడ్ విషయంలో ఏం జరుగుతుందో మరి!