కుప్పంలో చంద్రబాబు పర్యటక వివాదానికి దారి తీసింది. ఆయనకు వైసీపీ శ్రేణులు అడ్డుతగలడాన్ని టీడీపీ అవకాశంగా తీసుకుంది. అన్నా క్యాంటీన్‌పై దాడి, అలాగే టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించడంపై చంద్రబాబు మండిపడ్డారు. బస్టాండ్ సమీపంలోని అన్నా క్యాంటీన్‌కు సమీపంలో ఆయన నిరసనకు దిగారు. చంద్రబాబుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంపై విజయవాడలో టీడీపీ ఆందోళనకు దిగింది.
దీనికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వం వహించారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దుర్మార్గుడు, ఫ్యాక్షనిస్ట్ అని మండిపడ్డారు. ఏపీలో టీడీపీ లేకుండా చేసేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆ కుట్రల్ని టీడీపీ తిప్పి కొడుతుందని ఆయన హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలను టీడీపీ గెలవబోతోందని జోస్యం చెప్పారు. అందుకే సీఎం జగన్‌కు పిచ్చి ఎక్కిందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం మాదిరి వ్యవహరించి వుంటే జగన్ పాదయాత్ర చేసేవారా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. జగన్‌కు పిచ్చి ముదిరి, పరాకాష్ఠకు చేరిందన్నారు. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు వేస్తే ఒక రేటు.. దాడి చేస్తే ఒక రేటు ఇచ్చి వైసీపీ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. కుప్పంలో అల్లర్లు అడుపు చేయకపోతే సీఎం ఇల్లు, డీజీపీ కార్యాలయం ముట్టడిస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
ఏపీలో 175కు 175 స్థానాల్లో గెలుస్తామని కొంత కాలంగా వైసీపీ చెబుతోంది. అదే కౌంటర్‌ను టీడీపీ తెరపైకి తేవడం గమనార్హం. మైండ్ గేమ్‌లో టీడీపీ, వైసీపీ వేటికవే అన్నట్టు పోటీ పడి ఎన్నికల జోస్యం చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై ఇరు పార్టీల నేతలు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.