సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ రోజు మళ్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముహమ్మద్ ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్టు చేసిన తర్వాత రాజా సింగ్‌కు బెయిల్ మంజూరు చేసిన రెండు రోజుల తర్వాత ఈ ఆరెస్ట్ జరిగింది.
ఈ రోజు సోషల్ మీడియాలో మాట్లాడుతూ.. తనను నగర బహిష్కరణ చేయాలని ప్లాన్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ తన ఇంటి నుండి సెల్ఫీ వీడియో విడుదల చేసిన కాసేపటికే పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.
మొన్న అరెస్టు సందర్భంగా పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వలేదని.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదంటూ.. రాజాసింగ్ తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో రిమాండ్ ను కోర్టు తోసిపుచ్చింది. బెయిల్ మంజురు చేసింది.
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాజాసింగ్ ఇంటికి చేరుకుని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై బీజేపీ నేతలు ఇంకా ఎటువంటి ప్రకటనలు చేయలేదు. ఆరెస్ట్ సందర్భంగా పాతబస్తీలో ఎటువంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.