శ్రీకాకుళానికి హైదరాబాద్ ఫ్లైట్ లో ఆదరాబాదరాగా వచ్చిన టీడీపీ యువ నేత నారా లోకేష్ ఈ అదివారానా శ్రీకాకుళం కొత్త రోడ్డులో పోలీసులతోనే మాటల యుద్ధం పెట్టుకున్నారు. పలాసాలో ఉద్రిక్తతలు జరుగుతాయని సాక్షాత్తూ ప్రభుత్వ మంత్రినే హౌస్ అరెస్ట్ చేసిన పోలీస్ విపక్షం అక్కడ లోకేష్ వెళ్ళి యాగీ చేయడాన్ని చూస్తూ ఊరుకుంటారా.
పలాసాలో ఏదో జరిగిపోతోంది అంటూ హైదరాబాద్ నుంచి విమానమెక్కి వచ్చి శ్రీకాకుళం రోడ్డులో బైఠాయించి తెగ ఆయాసపడుతున్న లోకేష్ కి అక్కడ పార్టీ నాయకులు ఎవరూ లేరా అంటే చాలా మందే ఉన్నారు. పైగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు కూడా అదే జిల్లా వారు. పలాసాలో ఏదైనా జరిగితే పార్టీ తరఫున మాట్లాడాలీ అంటే అచ్చెన్న ఒక పెద్ద నాయకుడుగా సరిపోతారుగా.
కానీ ఆయన్ని పక్కన పెట్టేసి మరీ లోకేష్ ఆదరాబాదరాగా రావడమే కాదు, పలాసాలో ఉద్రిక్తతలు వద్దు అంటూ మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెబుతున్నా వినకుండా పోలీసుల మీదనే ఫైర్ అవడమే విశేషం అంటున్నారు. అంతే కాదు అచ్చం తన తండ్రి చంద్రబాబు తరహాలో ఏం తమాషాలు చేస్తున్నారా అని కూడా పోలీసుల మీదనే చినబాబు ఓవరాయక్షన్ చేశారని అంటున్నారు.
ఇక తాను ప్రజా ప్రతినిధిని వెళ్ళకూడదా అని కూడా లోకేష్ లా పాయింట్ తీశారు. అయితే లోకేష్ ప్రజల నుంచి ఎక్కడ నెగ్గారు చెప్పండి అంటున్నారు వైసీపీ నేతలు. ఆయన దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి నేను ప్రజా ప్రతినిధి అనడం హాస్యాస్పదమే కదా అంటున్నారు. ఇక డోంట్ టచ్ మీ అంటూ పోలీసులనే లోకేష్ హెచ్చరిస్తున్న వీడియోలను కూడా వైసీపీ వారు వైరల్ చేస్తున్నారు.
ఇంతకీ లోకేష్ పలాసా వచ్చి పరామర్శించాలనుకుంటున్నది ఎవరినో తెలుసా అంటే అదే విచిత్రం. చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ పలాస 27వ వార్డు కౌన్సిలర్, టీడీపీ నేత సూర్యనారాయణరాజు ఇళ్లను కూలగొట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తే టీడీపీ నేతలు అడ్డుకుని ఉద్రిక్తలు సృష్టించారు. దాంతో అక్కడ వివాదం రాజుకుంది.
మరి లోకేష్ ఇంతకీ ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్న తమ పార్టీ నేతలకు మద్దతు ఇవ్వడానికా పలాసా వచ్చేది అని వైసీపీ నేతలు సూటిగానే అడుగుతున్నారు. మొత్తానికి లోకేశానికి ఆవేశం పాలు ఎక్కువే కానీ ఆలోచన కూడా ఉండాలి కదా అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.