విశాఖ మహా నగరం. ఇది స్వాతంత్రానికి పూర్వమే బ్రిటిష్ వారు మెచ్చి వన్నె తెచ్చిన నగరం. సహజసిద్ధమైన సౌందర్యం విశాఖ సొంతం. దాంతో పాటే విశాఖకు అన్ని విధాలుగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి కాబట్టే ఒక్కోటీ అలా వచ్చి మణిహారంగా చేరాయి. స్వాతంత్రానికి పూర్వమే పోర్టుతో పాటు రైల్వే వచ్చింది. ప్రతిష్టాత్మకమైన ఏయూ కూడా ఆనాడే వచ్చింది.
అలాంటి విశాఖ స్వాతంత్రం తరువాత అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలతో మరింతగా ఎదిగింది. దానికి అనుబంధ పరిశ్రమలు కూడా రావడంతో సిటీ స్వరూపం మారిపోయింది. ఇక విశాఖ ఉమ్మడి ఏపీలో కూడా హైదరాబాద్ తో ధీటైన సిటీగా ఎదిగింది. నాడు అంతా హైదరాబాద్ కే దోచి పెట్టిన సమయంలో కూడా విశాఖ సొంతంగా ఎదిగి తానేంటో చూపించింది.
అటువంటి విశాఖను అభివృద్ధి చేశామని ఎవరైనా చెప్పుకుంటే అంతకంటే తప్పు మాట మరోటి ఉండదు, టీడీపీ వారు ఈ రోజుకీ గొప్పగా చెప్పుకునేది హైదరాబాద్ ని అభివృద్ధి చేశామనే. కానీ విశాఖ విషయంలో విభజన తరువాత టీడీపీ ఏలుబడిలో అయిదేళ్లలో ఏం చేశారు అంటే ఎవరూ చెప్పేది కూడా లేదని అంటారు. ఇక భూ కబ్జాలు టీడీపీ హయాంలోనే పెరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా నాటి విశాఖ జిల్లా మంత్రే అది నిజమని చెబుతూ తానే స్వయంగా సిట్ కి ఫిర్యాదు చేశారు.
ఇవన్నీ కళ్ళ ముందున్న విషయాలు అయితే విశాఖ అంటే బాబుకు అమితమైన ప్రేమ అని ఆ పార్టీ నాయకుడు బుద్ధా వెంకన్న చెబుతున్నారు. విశాఖను టీడీపీ ఎంతో అభివృద్ధి చేసింది అని కూడా అంటున్నారు. మరి టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే నాడు విశాఖ రాజధానిగా చేయమని తామంతా కోరితే బాబు అసలు వినలేదని ఆరోపించిన దానికి వెంకన్న జవాబు ఏం చెబుతారో. రాజధాని అంటే విశాఖకే ఎక్కువ ఓట్లు వచ్చాయని కూడా టీడీపీ వారే ఆఫ్ ది రికార్డు గా చెబుతారు.
మరి విశాఖను రాజధానిగా చేసుకుని బాబు పాలిస్తే అయిదేళ్ళలో ఎంతో ముందుకు ఏపీ కూడా వెళ్ళేది కదా. అవన్నీ పక్కన పెట్టేసి బాబుకు విశాఖ మీద ప్రేమ, జగన్ కి పగ అంటూ వెంకన్న మాట్లాడుతున్నారు. దాని మీద వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. ఉత్తరాంధ్రాలో ఏ ఒక్క హామీని నెరవేర్చని బాబు విశాఖ మీద ప్రేమ అంటే జనాలు ఎందుకు నమ్ముతారు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
ఇక టీడీపీ హయాంలో భూ కబ్జాలు జరిగిన సంగతిని టీడీపీ సర్కారే సిట్ వేసిన దాన్ని మరచి వైసీపీ మీద ఆరోపణలు చేయడమేంటి అని కూడా అంటున్నారు. ఇంతకీ విశాఖ మీద ఎవరికి ప్రేమ ఉంది, ఎవరికి పగ ఉంది అంటే జవాబు చెప్పాల్సింది జనాలే తప్ప టీడీపీ తమ్ముళ్ళు కానే కాదని అంటున్నారు.