2024 త‌ర్వాత జ‌గ‌న్‌, వైసీపీ…అంతే సంగ‌తట‌!

2024లో అధికారం త‌మ‌దే అని టీడీపీ నేత‌లు క‌ల‌లు కంటున్నారు. తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని, ఆ త‌ర్వాత ప్ర‌తీకారం తీర్చుకోవ‌డంపై టీడీపీ నేత‌లు లెక్క‌లు వేసుకుంటున్నారు. రాజ‌కీయంగా ఎవ‌రెవ‌రి భ‌ర‌తం ప‌ట్టాలి? అలాగే…

2024లో అధికారం త‌మ‌దే అని టీడీపీ నేత‌లు క‌ల‌లు కంటున్నారు. తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని, ఆ త‌ర్వాత ప్ర‌తీకారం తీర్చుకోవ‌డంపై టీడీపీ నేత‌లు లెక్క‌లు వేసుకుంటున్నారు. రాజ‌కీయంగా ఎవ‌రెవ‌రి భ‌ర‌తం ప‌ట్టాలి? అలాగే పోలీస్‌, ఇత‌ర శాఖ‌ల‌కు చెందిన అధికారుల‌ను టార్గెట్ చేస్తామంటూ ఆ పార్టీ నేత‌లు బ‌హిరంగంగానే హెచ్చ‌రిస్తున్నారు. 

తాజాగా కుప్పంలో చంద్ర‌బాబును అడ్డుకోవ‌డం, అలాగే ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేత‌ల‌పై పోలీస్ అధికారులు మీసాలు తిప్పుతూ, తొడ‌లు కొడుతూ స‌వాల్ విసురుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ 2024 త‌ర్వాత వైసీపీ భ‌విష్య‌త్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2024 త‌ర్వాత ఏపీలో వైసీపీ ఉండ‌ద‌ని, సీఎం జ‌గ‌న్ ఉండ‌ర‌ని జోస్యం చెప్పారు. మూడేళ్ల‌లో ఎంత మందిపై అక్ర‌మ కేసులు పెట్టారో, ఎంత మందిని జైళ్ల‌కు పంపారో లెక్కే లేద‌న్నారు. కొంత మంది పోలీసులు వైసీపీ నేత‌ల‌తో కుమ్మ‌క్క‌యి అక్ర‌మ కేసులు, అర్ధ‌రాత్రి అరెస్టులు, థ‌ర్డ్ డిగ్రీల‌తో టీడీపీ కార్య‌క‌ర్త‌ల్ని వేధిస్తున్నార‌ని ఆయ‌న వాపోయారు.

పోలీసులు ఓవ‌రాక్ష‌న్ త‌గ్గించుకుంటే మంచిద‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. చ‌ట్ట విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న పోలీసుల జాబితా త‌యారు చేస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. త‌మ కార్య‌క‌ర్త‌ల క‌న్నీళ్ల‌కు కార‌ణ‌మైన పోలీసుల‌ను, వైసీపీ నేత‌ల్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ని హెచ్చ‌రించారు. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేసిన రోజే ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు శ్రీ‌కారం చుడ‌తామ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

వైసీపీ, టీడీపీ నేత‌లు ప‌ర‌స్ప‌రం త‌మ రాజ‌కీయ పంతాలు , ప‌ట్టింపుల‌ను నెర‌వేర్చ‌డం కోసం జ‌నాలు ఓట్లు వేయాలా? అనే ప్ర‌శ్న‌లొస్తున్నాయి. అభివృద్ధి చేయండ‌య్యా సామి అంటే, ఆ ప‌ని వ‌దిలేసి తాము అధికారంలోకి వ‌స్తే, వాళ్ల ప‌ని తేలుస్తాం, వీళ్లు అంతు చూస్తామ‌ని నేత‌లు చెప్ప‌డం గ‌మ‌నార్హం. అధికారంలోకి ఎందుకు రావాల‌ని అనుకుంటున్నారో వీరి ప్ర‌క‌ట‌న‌లు చూస్తే అర్థ‌మ‌వుతోంది.