పవన్ కళ్యాణ్. జనసేన అధినాయకుడు. ఆయన 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు. అందులో ఒకటి విశాఖ జిల్లాలోని గాజువాకగా ఉంది. పవన్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తాడు అన్నది ఇప్పటిదాకా అయితే ఏ రకమైన క్లారిటీ లేదు.
అయితే జనసేన నాయకులు మాత్రం మరోసారి గాజువాక నుంచి తమ నాయకుడిని పోటీ చేయమని కోరుతున్నారు. ఈసారి తప్పనిసరిగా గెలిపించుకుంటామని చెబుతున్నారు. అయితే పవన్ గాజువాకాలో మళ్లీ పోటీ చేసినా వైసీపీ గెలిచి తీరుతుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
ఈసారి కూడా తిప్పల కుటుంబమే గాజువాకలో జెండా ఎగరేస్తుందని మహిళా నాయకురాలు రోజారాణి బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. గత మూడున్నరేళ్ళుగా జనంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఉన్నారని అంటున్నారు.
ఆయన పేదల కోసం ఎంతో చేస్తున్నారని, వారి కష్టాలను తీరుస్తున్నానని, పిలిచిన వెంటనే పలికే వారు తమ ఎమ్మెల్యే అని ఆమె చెబుతున్నారు. ఎన్నికలో ఓడిపోగానే గాజువాక వైపు మళ్ళీ చూడని పవన్ని ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారని ఆమె ప్రశ్నిస్తునారు. గతసారి కంటే కూడా ఈసారి గాజువాకలో తిప్పలకు భారీ మెజారిటీ వస్తుందని ఆమె చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కలసి పోటీ చేసినా వైసీపీకి ఏమీ ఇబ్బంది లేదని ఆమె అంటున్నారు. అందువల్ల కూటమి ఉమ్మడి అభ్యర్ధిగా పవన్ పోటీ చేసినా తమ పార్టీ విజయానికి ఏ ఢోకా ఉండని అంటున్నారు. పవన్ని సింగిల్ హ్యాండ్ తో గెలిపించుకుంటామని చెబుతున్న జనసైనికులు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో.