ఆ ఇద్దరికీ జన్మ వైరం. ఇద్దరూ కూడా ఎపుడూ వేరు వేరు పార్టీలలో ఉంటూ రాజకీయంగా సై అంటే సై అంటూ ఉంటారు. ఇద్దరిదీ ఒక్కటే నియోజకవర్గం. అదే శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి. టెక్కలి సిట్టింగ్ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మీద వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అయితే నిప్పులు చెరుగుతున్నారు.
మహానాడు వేదికగా అచ్చెన్న మాట్లాడినది అంతా కూడా శుద్ధ అబద్ధమని, జగన్ని విమర్శించే తాహతు, స్థాయి అచ్చెన్నకు లేదని దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారు. అచ్చెన్న అవినీతిని టెక్కలిలో లెక్కదీసి మరీ బయటపెడతాను అని కూడా దువ్వాడ అంటున్నారు.
ఇక తాను అవసరం అయితే ఆత్మాహుతిదళంగా మారిపోతాను అని ఆయన అనడమే విశేషం. తనకు ప్రాణాల మీద తీపి ఏ మాత్రం లేదని ఆయన అంటూ జగన్ కోసం ఏమైనా చేయడానికి రెడీ అని చెబుతున్నారు.
ఇక టెక్కలిలో అచ్చెన్న ఎన్నో అక్రమాలు చేసి కూడా ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఆయన తన గురించి ఎవరికీ తెలియదు అనుకుంటున్నారేమో అని దువ్వాడ చెప్పుకొచ్చారు.
ఎన్నో అక్రమాలు చేసిన అచ్చెన్న జగన్ని పట్టుని విమర్శలు చేస్తే అసలు ఊరుకోనని ఆయన తాట తీస్తానని దువ్వాడ అంటున్నారు. అదే విధంగా అంకుశం సినిమాలో రామిరెడ్డిని రోడ్ల మీద కొట్టుకుని తీసుకెళ్ళినట్లుగా అచ్చెన్నను నడిపించే రోజు వస్తుందని హెచ్చరించారు. దువ్వాడ ఆగ్రహం చూస్తే అలా ఉంది.
అచ్చెన్నాయుడు మీద రెండు దశాబ్దాలుగా అలుపెరగని తీరున పోరాడుతున్న దువ్వాడ అచ్చెన్న విషయంలో నో కాంప్రమైజ్ అని అంటున్నారు. ముందు నాతో పోరాడు అచ్చెన్నా అంటూ సవాల్ చేస్తున్నారు. అచ్చెన్నాయుడు దీని మీద ఎలా స్పందిస్తారో మరి.