ఏపీలో బీజేపీ పరిస్థితి చాలా విచిత్రంగా వుంది. చాలా వరకూ రాజకీయ, వ్యక్తిగత, వ్యాపార అవసరాల రీత్యా బీజేపీని ఆశ్రయించిన నేతలున్నారు. బీజేపీతో అవసరాలు తీరిన తర్వాత ఎవరూ ఆ పార్టీలో కొనసాగడానికి ఇష్టపడడం లేదు. తాజా ఉదాహరణ కన్నా లక్ష్మీనారాయణే. కనీసం ఆయన పార్టీ నుంచి బయటికెళ్లి బీజేపీకి ఊరట కలిగించారు. లేదంటే బీజేపీలో వుంటూ నిత్యం సోము వీర్రాజును విమర్శిస్తుండడం, అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే అసహ్యంగా వుండేది.
తాజాగా మరో బీజేపీ నాయకుడు ఆ పార్టీలోనే వుంటానంటూ, పరోక్షంగా శల్య సారథ్యం చేస్తానని ప్రకటించడం విశేషం. బహుశా బీజేపీలో వుంటూ చంద్రబాబు ప్రయోజనాల కోసం పని చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టున్నారు. ఎల్లో మీడియాధిపతి నిర్వహించిన ఓ షోలో మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఆదినారాయణరెడ్డి తన మనసులో మాటను బయట పెట్టారు.
ఏకంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడినే ఆయన టార్గెట్ చేయడం గమనార్హం. గతంలో ఏపీలో బీజేపీకి 8 శాతం ఓటింగ్ ఉండేదని, గత సార్వత్రిక ఎన్నికల్లో అది 0.5 శాతానికి పడిపోయిందని, ఇప్పుడు అది కూడా ఉందో లేదో అంటే… మాజీ మంత్రి స్పందన ఆసక్తికరంగా వుంది. ఈ విషయమై తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పామన్నారు. పార్టీలో ఆయన సీనియర్ అని, తమ మాట వినే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పొత్తులు కుదుర్చుకుంటాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఒకవేళ కుదరకున్నా బీజేపీని వీడేది లేదని ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. సహజంగా తమ పార్టీ నాయకులు వేరే పార్టీలోకి వెళ్లారంటే ఆశ్చర్యపోతుంటారు. కానీ బీజేపీలో అందుకు భిన్నమైన పరిస్థితి. ఫలానా నాయకులు బీజేపీలోనే కొనసాగుతామని చెబుతున్నారా? అరె భలే విచిత్రంగా వుందే అని ఆ పార్టీ నాయకులు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్న పరిస్థితి.
తెల్లారి లేచినప్పటి నుంచి వైఎస్ జగన్ను ఆదినారాయణరెడ్డి తిట్టితిట్టి చివరికి ప్రజావ్యతిరేకత సంపాదించుకున్నారు. అయినప్పటికీ ఇంకా మారకుండా, అదే పంథా కొనసాగిస్తున్నారు. ఇందుకు తాజా ఇంటర్వ్యూనే నిదర్శనం.