యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్‌కు ఉనికి సమస్య ఏర్పడింది. తనను అడుగడుగునా వైసీపీ సర్కార్ అడ్డుకోవాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. కానీ ఆయన కోరుకుంటున్నట్టుగా ప్రభుత్వం నడుచుకోవడం లేదు. ఈ ధోరణే లోకేశ్‌కు అసలు నచ్చడం లేదు. అడ్డంకులు సృష్టించకుండా వుంటే పాదయాత్ర, లేదంటే దండయాత్ర అని లోకేశ్ ప్రగల్భాలు పలకడం తెలిసిందే.
తన పాదయాత్రను అడ్డుకోడానికి వెయ్యి మంది పోలీసులతో వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆయన కామెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 34 రోజుల పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆయన పాదయాత్ర సాగించారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా ఆయనపై ఐదు కేసులు బనాయించారు. పలమనేరు సభలో ప్రచార రథాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పడంతో లోకేశ్ నిరసనకు దిగారు. ఈ ఘటనలో లోకేశ్‌పై కేసు నమోదైంది.
ఆ తర్వాత బంగారుపాళ్యంలో ప్రచార రథం మీద నుంచి ప్రసంగించొద్దని పోలీసులు అడ్డుకున్నారు. రథంతో పాటు సౌండ్ వాహనాలను సీజ్ చేశారు. ఇక్కడ కూడా లోకేశ్‌పై కేసు నమోదైంది. ఆ తర్వాత తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలోని గాజులమండ్యం వద్ద స్టూల్‌పైకి ఎక్కి ప్రసంగిస్తుండగా లోకేశ్‌ను సీఐ అడ్డుకున్నారు. అనంతరం తనను బెదిరించారని సీఐ ఫిర్యాదు మేరకు లోకేశ్‌పై కేసు నమోదైంది.
ఆ తర్వాత తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు నియోజకవర్గాల్లో లోకేశ్ పాదయాత్ర సాగింది. ఈ నియోజక వర్గాల ప్రజాప్రతినిధులు తెలివిగా వ్యవహరించారు. లోకేశ్‌ను ఏ మాత్రం పట్టించుకోవద్దని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. లోకేశ్‌ను అడ్డుకుంటే అతనికి ఉచిత ప్రచారం కల్పించినట్టు అవుతుందనే భావనతోనే వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు సమాచారం.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో తనను అడ్డుకుంటారని లోకేశ్ ఆశించారు. కానీ లోకేశ్ ఆశల్ని నీరుగార్చారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన్ను లైట్ తీసుకున్నారు. తాను ఏం మాట్లాడుతున్నా పోలీసులు అడ్డుకోకపోవడంపై లోకేశ్ ఆశ్చర్యపోతున్నారు. దీంతో తన పాదయాత్రకు తగిన ప్రచారం రావడం లేదని ఆయన ఆందోళన చెందుతున్నారు.
అసలే ఆదరణ కరువై పాదయాత్ర అంతంత మాత్రంగా సాగుతోంది. వైసీపీ మారిన వ్యూహంతో లోకేశ్ పాదయాత్ర చప్పగా సాగుతోందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.