Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఇది క్షుద్ర మీడియా

ఇది క్షుద్ర మీడియా

మాంసం తిన్నాం కదా అని ఎముకలు మెడలో వేసుకుని తిరగవలసిన అవసరం లేదు. చాలా పాత సామెత ఇది. ‘సామెతలో నీతిని నేనెందుకు పాటిస్తా.. నేను ఎముకలు మెడలో వేసుకునే తిరుగుతా’ అని ఎవరైనా అంటే.. ఏం చేయగలం? వారి మానసిక స్థితి గాడి తప్పినదని అనుకుని ఇగ్నోర్ చేయగలం. 

మామూలు వ్యాపారాలలో ఇలా మానసిక స్థితి సరిగాలేని వారు ఎలా చెలరేగినా సమాజానికి జరిగే చేటు ఏమీ లేదు. కానీ, ‘ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అని గర్వంగా చెప్పుకునే, సామాజిక అవ్యవస్థలపై, అస్తవ్యస్తతలపై అలుపెరగని అక్షరసమరం సాగించే జర్నలిజంలో కూడా.. ఇలాంటి వారు తయారైతే అది సమాజానికి ప్రమాదం. 

ఖర్మం ఏమిటంటే.. ఇలా మానసిక స్థితి సరిగాలేని యజమానుల చేతిలో మీడియా సంస్థలు ఉన్నప్పటికీ.. నియంత్రించగల దార్లు లేవు. కేవలం ఎముకలు ధరించి తిరిగే సదరు వక్రబుద్ధుల సంస్థల రాతలపై ప్రజలు అప్రమత్తంగా ఉండడం ఒక్కటే మార్గం. దారితప్పడం ఎప్పుడో జరిగిపోయింది.. దిగజారడంలో సరికొత్త పాతాళాలను అన్వేషిస్తున్న మీడియా పోకడలపై ఈవారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ.

మీడియా అంటేనే ప్రజల గొంతుక! ఈ నిర్వచనంతోనే, ఈ లక్ష్యంతోనే తొలినాటినుంచి మన దేశంలో పత్రికలు పుట్టాయి. ప్రపంచ చరిత్రలో పత్రికల పుట్టుక సమాచారం ప్రజలకు అందజేయడం కోసం ప్రారంభమై ఆ తర్వాత.. రకరకాలుగా రూపుమారి ఉండవచ్చు. మిగిలిన ప్రపంచ దేశాల చారిత్రక నేపథ్యంలో అలాంటి పరిస్థితులు ఉండవచ్చు. కానీ, భారతదేశంలో మీడియా పుట్టుకనాటి నేపథ్యం వేరు. మన దేశంలో పత్రికలు పుట్టే నాటికి స్వాతంత్ర్యపోరాటం జరుగుతోంది. కేవలం సమాచారాన్ని అందరికీ తెలియజెప్పడానికి మాత్రమే కాకుండా, ఒక అభిప్రాయాన్ని వ్యాప్తి చెందించడానికి, ఒక పోరాట స్ఫూర్తిని ప్రజల్లో రగిలించడానికి తొలినాటి పత్రికలు కూడా పుట్టాయి. 

కానీ కాలక్రమంలో వాటి రూపం మారింది. తీరుతెన్నులు మారాయి. ఒక భావజాలాన్ని ప్రచారం చేయడానికి పత్రికలు పరిమితం అవుతూ వచ్చాయి. ఆ యావలో నిజానిజాల్ని విస్మరించడం కూడా మొదలైంది. వాస్తవం ఏమిటో వారికి అక్కర్లేదు, తమ భావజాలానికి అనుకూలంగా ఉన్న విషయాల్ని మాత్రమే ప్రచురించడం మొదలైంది. ప్రత్యేకించి తెలుగు పత్రికల చరిత్రలో ఈనాడు పుట్టిన తర్వాత.. ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కరపత్రికలాగా పత్రికలు పనిచేయడం అనే అవాంఛనీయమైన సంస్కృతి కూడా మొదలైంది. ఇంకా దారుణం ఏంటంటే.. పత్రికలు ఒక రాజకీయ పార్టీకి మాత్రమే కాదు.. ఒక కులానికి కొమ్ము కాయడం కోసం పనిచేస్తున్నాయా.. అనే అనుమానాలు కూడా ప్రజల్లో మొదలయ్యాయి. 

ఆధునికతరంలో నికృష్ట దశలో మీడియా

నిజానికి ఏ వ్యాపారం అయినా .. ఆధునికతరానికి అనుగుణంగా రూపుమార్చుకుంటున్న కొద్దీ కొత్త హంగులను దిద్దుకుంటుంది. కొత్త ప్రమాణాలను అందుకుంటుంది. కానీ.. మీడియా విషయంలో తద్భిన్నంగా జరుగుతోంది. రోజురోజుకూ దిగజారుతున్న ప్రమాణాలు, పనిగట్టుకుని చేస్తున్న తప్పుడు ప్రచారాలు, మీడియా అనే ముసుగు ఉన్నందుకు రాజకీయ పార్టీల కంటె నీచమైన తప్పుడు ప్రచారాలు చేయడం తమ జన్మహక్కుగా భావించే తత్వం ఇవాళ్టి మీడియాలో వచ్చేసింది. 

మీడియా పెడదారి పట్టిపోతున్నదనడంలో ఎవరి పాత్రను తక్కువ అంచనా వేయలేం. కానీ పాఠకుడి దృష్టిలో తటస్థ మీడియా ఎవరు? ఏమిటి? ఎవరిని విశ్వాసం లోకి తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? ఎంతవరకు తీసుకోవాలి? అనే అభిప్రాయాలు కొన్ని ఉంటాయి. 

ఉదాహరణకు సాక్షి దినపత్రికను తీసుకుంటే.. అదేమీ కడిగిన ముత్యం అని నిష్పాక్షికంగా అచ్చమైన ప్రజాభిప్రాయానికి, రాజకీయ వాస్తవ పరిణామాలకు ప్రతిబింబంగా నిలుస్తుందని అనుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కానీ, రాజకీయ ప్రత్యర్థులు నిందించగలరే తప్ప, సాధారణ సామాన్య పాఠకుడు సాక్షిని తప్పుపట్టే అవకాశం తక్కువ. ఎందుకంటే.. సాక్షి అనే దినపత్రిక పుట్టడమే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరాలను తీర్చడానికి జరిగిందనే స్పృహ అందరికీ ఉంది. ఆ పత్రిక కూడా అలాంటి ముద్రను తొలగించుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. తమ మీడియా సంస్థ, తటస్థ వేదిక అనిగానీ, ప్రజల కష్టాలకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చే అద్భుతమైన ప్రయత్నం అనిగానీ.. వారు ఎన్నడూ ఆత్మవంచన చేసుకుంటూ ప్రకటించలేదు. కానీ ఇతర పత్రికల సంగతి అలాకాదు. 

పైకి నీతులు వల్లిస్తుంటారు. నైతికతను ప్రవచిస్తుంటారు. కానీ వ్యవహారంలో మాత్రం దిగజారుడు పోకడల్లో శృతిమించిపోతున్నారు. గోబెల్స్ కూడా ఇంతటి అసహ్యకరమైన మీడియా పోకడలను ఊహించి ఉండడు. సాధారణంగా మీడియా దిగజారుడు అనేది.. తమకు కావాల్సిన వారిని మహానుభావులుగా ప్రొజెక్టు చేసుకోవడం వరకు మాత్రమే పరిమితమై ఉండేది. 

అబద్ధాలతో వారిని హీరోలుగా నిరూపించే ప్రయత్నాలు జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ప్రత్యేకించి తెలుగు మీడియా.. అంతకంటె పతనావస్థలో.. ప్రజల ప్రేమాభిమానాలు పొందగలుగుతున్న ఒక వ్యక్తి పట్ల ద్వేషంతో.. విషం చిమ్మడమే లక్ష్యంగా సాగుతున్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండు పత్రికలను తీసుకున్నప్పటికీ కూడా.. ఈ దుర్మార్గం మనకు అణువణువునా కనిపిస్తుంది. 

ఇటీవలి పరిణామాల్లో పట్టాభి అరెస్టు వ్యవహారాన్నే తీసుకుందాం. తెలుగుదేశం వారందరికీ ఒక స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ తయారయ్యాయి. ‘ప్రభుత్వం మీద హద్దూ అదుపూ లేకుండా రెచ్చిపోవాలి. అరెస్టులు జరిగితే గనుక.. తమను దారుణంగా కొట్టినట్టుగా ప్రచారం చేయాలి.’  ఇది వారు నమ్ముతున్న సూత్రం. డ్రామా ఆర్టిస్టులను మించిపోయే పెయిడ్ ఆర్టిస్ట్ పట్టాభికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోలీసులు తనని కొట్టారని ఆయన అరచేతులు ఎత్తిచూపించారు. పోలీసులు ఎంత జాగ్రత్తగా ఆయనమీద ఈగవాలనివ్వకుండా నిర్బంధించినా కూడా.. తన అరచేతులతో ఎదురుగా ఉన్న ఊచలనో, మరొక వస్తువునో గట్టిగా కాసేపు బిగించి పట్టుకున్నా కూడా చేతులు వాస్తాయి. అలాంటి వాపును మాత్రమే ఆయన చూపించాడు. 

పోలీసులు అరచేతులు వాచేలా కొట్టినట్టుగా పచ్చమీడియా మొత్తం ఎడాపెడా ప్రచారం చేసింది. ‘పోలీసుదెబ్బలు’ అంటే కనిపించని గాయాలు అనే నానుడి ఉన్నది గానీ.. పోలీసులు అలా అరచేతులమీద మాత్రమే ఎందుకు కొడతారు? అయినా అలా చేతులెత్తి చూపిస్తే.., పచ్చ మీడియా మొత్తం రెచ్చిపోయింది. 

ఈనాడు తాము అందరికంటె ప్రత్యేకం అని నిరూపించుకుంది. ఆయన చేతులు చూపిస్తే, తమకు మాత్రమే ఎక్స్‌క్లూజివ్ అన్నట్టుగా కాళ్లకున్న గాయాల ఫోటోలు కూడా చూపించింది. పత్రికలో ప్రచురించి.. ప్రజలను తప్పుదోవ పట్టించింది. నిజానికి టీవీ చానెళ్లలో ఎక్కడా కనిపించని ఆ కాళ్ల దృశ్యాలు తమకు మాత్రం ఎలా వచ్చాయనే కామన్ సెన్స్ ఈనాడు ఆఫీసులో ఎవ్వరికీ పనిచేయలేదు. 

జగన్ ను మరింత విలన్ గా ప్రొజెక్టు చేయడానికి తమ శక్తివంచన లేకుండా ఏం చేయగలమో అదంతా చేయాలనేది వారి కోరిక, బహుశా వారికి ఉన్న పురమాయింపు. అందుకే కాళ్ల ఫోటోలు కూడా వేశారు. నిజానికి ఆ కాళ్ల ఫోటోలు ఎప్పుడో పాతవి. ఈ సందర్భానికి సంబంధిచినవి కానేకాదు. ఈ విషయం బయటకు రాగానే.. ఈనాడు దుర్మార్గాన్ని వైసీపీ వారు నీచంగా తిట్టడం సంగతి తర్వాత, ముందు తటస్థులైన పాఠకులు కూడా ఈ వక్రబుద్ధిని దారుణంగా అసహ్యించుకున్నారు. పత్రిక పరువు పోయింది. 

జగన్ ను విలన్ గా చేయడానికి తమ నైతికతను మొత్తం కాలబెట్టి ఈనాడు యంత్రాంగం పనిచేస్తుందనే అభిప్రాయం అందరికీ ఏర్పడింది. ఈనాడు కు పట్టిన ఖర్మం ఏంటంటే.. మరురోజు వారు క్షమాపణలు వేయాల్సి వచ్చింది. పొరబాటు జరిగిందని ఒప్పుకోవాల్సి వచ్చింది. ప్రజలకు పట్టిన ఖర్మం ఏంటంటే.. ఇలాంటి పత్రికలు కూడా.. తాము నిర్భయంగా  నిజాన్ని మాత్రమే రాస్తామని చెప్పుకుంటూ బతకడం. 

నిత్యం ఉషోదయాన సత్యం నినదించు గాక అంటే ప్రవచానలతో ప్రజలను మోసం చేస్తూ బతకడం. ఇంత అసహ్యకరమైన పోకడలు మీడియాలోకి ఎలా చొరబడ్డాయి. కేవలం చంద్రబాబు మీద ప్రేమ మాత్రమే కాదు, జగన్ అంటే పెంచుకున్న ద్వేషం, జగన్ ప్రజల్లో పెంచుకుంటున్న ఆదరణతో స్థిరంగా పాతుకుపోతాడనే భయం! అంతే తప్ప వేరొకటి కాదు. 

ఆంధ్రజ్యోతి సంగతి చూద్దాం. ‘జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిస్తే రాష్ట్రం నాశనం అవుతుందని, గెలవకూడదని చాలా మంది అనుకుంటున్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అదే’ అని ఎవరైనా ఒక విపక్ష పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు చెబితే మనం అర్థం చేసుకోవచ్చు. అది వారి అవసరం. వారు అలాగే మాట్లాడతారని సర్దుకోవచ్చు. సామాజిక కార్యకర్త చెబితే.. వారు ఎవరి ప్రభావంలోనైనా ఉండవచ్చు, లేదా వారి దృష్టికోణం అది అని అనుకోవచ్చు. 

కానీ.. ఒక పత్రికాధిపతి అక్షరాలా తన రాతల్లో చెబితే ఎలా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఒక్కటే లక్ష్యంగా నేను ఉన్నాను అని అధిపతి చెప్పిన తరవాత ఆ పత్రికలో ప్రభుత్వం గురించి మాత్రమే కాదు, ప్రజల కష్టాల గురించి కూడా అభూత కల్పనలు లేని వాస్తవమైన వార్తలు వస్తాయని ఎలా నమ్ముతాం. ఒకప్పట్లో తెలుగుజాతికి ప్రాణవాయువులాగా వెలుగొందిన ఆంధ్రజ్యోతి దినపత్రికను తన చేతిలోకి వచ్చిన తర్వాత.. ఒక్కొక్క మెట్టు దించుతూ.. ఇవాళ ఇంతటి అథోపాతాళంలోకి తోస్తున్నాడు వేమూరి రాధాకృష్ణ. 

ఏంటి విరుగుడు? ఏం జరగాలి?

ఇలా జగన్ పట్ల ద్వేషం మాత్రమే ఎజెండా, జగన్ సర్కారును ఓడించడం మాత్రమే లక్ష్యంగా బతికేవారిని మీడియాగా ఎందుకు నిర్వచించాలి. వాళ్లు కావలిస్తే కరపత్రికల్లాగానే నడుపుకోవచ్చు కదా. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు సహా వారికి ఎందుకు అందాలి. అసలు జర్నలిస్టులుగా వారికి ఎందుకు గుర్తింపు ఇవ్వాలి. పార్టీలు నడుపుకునే సోషల్ మీడియా బృందాలు కూడా విపరీతంగా తమ పార్టీ భావజాలాలకు తగినట్టుగా తమ గురించి అతిశయాలను, ప్రత్యర్థుల గురించి అబద్ధాలను ప్రచారం చేస్తుంటాయి. 

నిజానికి చాలా పత్రికల కంటె ఆయా సోషల్ మీడియా వారి పోస్టులకు ఉన్న రీచ్ ఎక్కువ. అలాగని వారందరినీ జర్నలిస్టులుగా పరిగణించి.. వారికి సదుపాయాలు, రాయితీలు ప్రభుత్వం కల్పించడం లేదు కదా. మరి ఇలా ఒక పార్టీకి వ్యతిరేకం, ప్రభుత్వాన్ని దించడానికే నేను పనిచేస్తున్నా అని సిగ్గువిడిచి బహిరంగంగా చెప్పుకునే పత్రికలను ప్రభుత్వాలు కేవలం కరపత్రాలుగా మాత్రమే గుర్తించాలి. 

మీడియా సంస్థలుగా ప్రభుత్వ సదుపాయాలు పొందే హోదాలన్నింటినీ రద్దు చేయాలి. వారు కేవలం పార్టీలకు తైనాతీ వేషాలకు మాత్రమే పరిమితం కావొచ్చు. తమ వ్యాపారం మాత్రమే చేసుకోవచ్చు. కానీ.. ప్రజా సేవ ముసుగులో మీడియా ముసుగులో విషాన్ని పంచిపెట్టే ధోరణులకు చెక్ పెట్టాలి. 

ఎంత కొమ్ములు తిరిగిన వ్యవస్థకైనా నియంత్రణ అనేది అవసరం. మహామహులు, ఈదేశంలోనే అత్యుత్తమమైన మేధావులు అనేకమంది కలిసి రాసిన మన రాజ్యాంగాన్నే ఆధునిక తరపు అవసరాలను బట్టి మార్చుకోవాలని మనం అనుకుంటున్నాం. అలాంటిది మీడియా సంస్థలకు కూడా నియంత్రణ అనేది అవసరం.. ఆ వ్యవస్థలు కూడా దారితప్పుతున్నప్పుడు… కొరడా ఝుళిపించే అధికారం ప్రభుత్వాల చేతిలో ఉంటే, అలాగని ప్రభుత్వాలు దానిని దుర్వినియోగం చేయకుండా జుడిషియరీ వంటి వ్యవస్థ రూపేణా ఒక కౌంటర్ చెక్ వ్యవస్థ కూడా ఏర్పాటు అయితే బాగుంటుంది. అప్పుడు అందరూ పద్ధతిగా దారిలోకి వస్తారు.

.. ఎల్ . విజయలక్ష్మి

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా