జనసేనాని పవన్‌కల్యాణ్‌కు రాజకీయంగా తెలివితేటలు తక్కువే అనుకుందాం. రాజకీయాలపై అవగాహన లేకపోవడంతో పవన్‌కల్యాణ్ తనకు తోచినట్టు మాట్లాడుతున్నారని కాసేపు సరిపెట్టుకుందాం. మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాదెండ్ల మనోహర్‌కు ఏమైంది? ఏపీలో రాణించాలనే ఆశయం, ఆకాంక్ష ఉన్న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ హోదాలో నాదెండ్ల మనోహర్ ఇప్పటంలో మాట్లాడిన మాటలేంటి?
151 సీట్లకే వైసీపీ ఇలా వేధిస్తే, రేపు 175 వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలని ప్రజలను నాదెండ్ల మనోహర్ కోరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కనీసం తమ పార్టీ నాయకుడు రెండు చోట్ల నిలిస్తే, ఒక్క చోట కూడా గెలవలేని దుస్థితి. అలాంటిది 151 సీట్లలో వైసీపీ గెలవడాన్ని నాదెండ్ల చాలా సులువుగా తీసుకోవడం విశేషం.
అలాగే తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, జనానికి భరోసా ఇచ్చేలా మాట్లాడ్డం మానేసి, వామ్మో వైసీపీకి 175 సీట్లు ఇస్తే ఇంకేమైనా వుందా? అని ప్రశ్నించడం రాజకీయంగా సరైందా? కాదా? అనేది ఆయనకే తెలియాలి.
వైసీపీకి భారీగా సీట్లు రావడం అంటే ప్రతిపక్షాల ఫెయిల్యూర్‌గా నాదెండ్లకు అర్థం కావడం లేదా? మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందనే భయం ఎక్కడో జనసేన నేతల్ని వెంటాడుతోందని వారి మాటలు తెలియజేస్తున్నాయి. అయ్యా మీకు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నిస్తే… పవన్, చంద్రబాబు నుంచి సమాధానం వుండదు. పైగా నాదెండ్ల లాంటి స్పందిస్తూ, 175 కాకుంటే 500 సీట్లలో నిలబడాలని వెటకారపు మాటలు.
జనసేన పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా, ఇంత వరకూ పది నియోజకవర్గాలకు కూడా ఇన్‌చార్జ్‌లు లేని దుస్థితి. ఇలాంటి పార్టీ వైసీపీ ఆగడాలను హెచ్చరించడం విచిత్రంగా వుంది. 175 సీట్లలో వైసీపీ గెలిస్తే అంటూ నాదెండ్ల భయపెట్టి ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్నట్టున్నారు. అదే ఆయన మాటల్లో కనిపిస్తోంది.