పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. దీన్ని నిర్మించాల్సిన పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అయితే కాంట్రాక్టులపై కక్కుర్తితో చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్మాణ బాధ్యతల్ని తీసుకుందన్నది వాస్తవం. పోలవరం పూర్తి చేయడంపై అసెంబ్లీ వేదికగా అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు జగన్ ప్రభుత్వం అబద్ధాల్ని చెప్పింది.
పరస్పరం రాజకీయ విమర్శలు, ప్రతీకార చర్యలు తీసుకోవడంలో ఉన్న శ్రద్ధ , ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దిశ, దశను మార్చే పోలవరం నిర్మాణంపై లేదు. ఏదో ఒక సాకుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోంది. డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా మందగించింది. డయాఫ్రం వాల్‌పై రాజకీయ విమర్శలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును శని, ఆదివారాల్లో చైర్మన్ ఏబీ పాండ్యా అధ్యక్షతన డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ (డీడీఆర్పీ) బృందం సందర్శించింది. డయాఫ్రం వాల్‌పై ఎన్‌హెచ్‌పీసీ తన నివేదికను అందజేసింది. దానిపై ఆదివారం రాజమహేంద్రవరంలో కేంద్ర జల సంఘం బృందం పర్యవేక్షణలో డీడీఆర్పీ, పీపీఏ, ఎన్‌హెచ్‌పీసీ, రాష్ట్ర జల వనరుల శాఖ సమీక్షించాయి. డయాఫ్రం వాల్‌పై కేంద్ర జలశక్తి శాఖ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) నిగ్గు తేల్చిందని, ఇంత కాలం వైసీపీ ప్రభుత్వం చేస్తున్నదంతా అబద్ధమంటూ వీకెండ్స్ జర్నలిస్టు సారథ్యం వహిస్తున్న పత్రిక రాసుకొచ్చింది.
“డయాఫ్రం వాల్‌పై అంతా విషమే!” అంటూ ఆ పత్రిక కథనంలో పేర్కొంది. అయితే విషం చిమ్మడంలో తనకు మరెవరూ సాటి రారని అదే కథనం ద్వారా ఆ పత్రిక నిరూపించుకుంది. ఒకవైపు డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడం, భారీగా దెబ్బతినడం జరగలేదని అధ్యయన నివేదిక వెల్లడిస్తోందని, జగన్ ప్రభుత్వం ఇన్నాళ్లు చెబుతున్నవన్నీ అబద్ధాలే అని సదరు పత్రిక తన మార్క్ జర్నలిజాన్ని పండించింది. అయితే తన సహజ లక్షణమైన విషం చిమ్మే స్వభావాన్ని సదరు పత్రిక ఆ తర్వాత వాక్యంలోనే ప్రదర్శించింది.
“భారీ గుంతను ఇసుకతో పూడ్చవచ్చని ఆ అధ్యయన సంస్థ పేర్కొందని రాయడం గమనార్హం. పూడ్చడానికి 85 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక కావాలని కూడా ఆ సంస్థ చెప్పినట్టు రాయడం ద్వారా విషం చిమ్ముతున్నదెవరో తనకు తానుగా ఆ పత్రిక బయటపెట్టుకుంది. ఒకవైపు భారీగా దెబ్బతినలేదంటూనే, మరోవైపు భారీ గుంతను ఇసుకతో పూడ్చవచ్చని రాయడం ద్వారా జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మడానికి ఉత్సాహంచూపుతున్న విషయం పాఠకులకు అర్థమైంది. పాఠకులు, ప్రజల చైతన్యస్థాయిని ఆ పత్రిక తక్కువ అంచనా వేయడం వల్ల ఎదురవుతున్న అవమానాలుగా భావించాల్సి వుంటుంది. సదరు విష పత్రిక రాసినట్టు 85 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఓ గుంతను పూడ్చడానికి అవసరమవుతోందంటే… అది ఏ స్థాయిలో దెబ్బతినిందో చిన్నపిల్లాడైనా చెబుతాడు.
అధ్యయన నివేదికను ఉన్నది ఉన్నట్టు రాస్తే సరిపోయేది. ఈనాడు పత్రిక అదే పని చేసింది. దాని తోక పత్రిక ఆ పని ఎప్పుడూ చేయదు కాక చేయదు. ఎందుకంటే నిజానిజాలతో సంబంధం లేకుండా నిత్యం విషం చిమ్మడమే లక్ష్యంగా పని చేయడమే కారణం. డయాఫ్రం వాల్ గోతిలో సదరు పత్రిక బొక్క బోర్లా పడింది ప్రజానీకంతో చీవాట్లు తినాల్సి వస్తోంది. అందుకే ఎవరు తీసిన గోతిలో వారే పడతారని పెద్దలు ఊరికే చెప్పలేదు.