సీఎం జగన్ నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టడంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. వైసీపీతో గ్యాప్ వచ్చిందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అటు సూర్యుడు ఇటు పొడిచినా జగన్‌తో విభేదాలనే మాటే లేదని మంగళగిరి ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. దీంతో వైసీపీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి దూరంగా ఉంటున్నారన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టైంది.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కీలక సమావేశానికి రాకపోవడంపై వివరణ ఇచ్చారు. అనారోగ్య సమస్యతో పాటు తన కుమారుడు పెళ్లయి 16 రోజుల పండుగ జరుపుకుంటున్న సందర్భంగా హైదరాబాద్ వెళ్లినట్టు చెప్పారు. మంగళగిరిలో తాను పోటీ చేయాలా లేదా అనేది జగన్ నిర్ణయం బట్టే వుంటుందన్నారు. కుప్పంలో చంద్రబాబు పోటీ చేయలేక పక్క నియోజకవర్గాలు చూసుకుంటున్నారని అన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు న్యాయం జరుగుతోందని, సామాజిక న్యాయం చేయాల్సిన తరుణంలో జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి వుంటానని తేల్చి చెప్పారు.
జగన్‌తోనే వుంటానని అసెంబ్లీ వేదికగా గతంలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జీవితంలో, రాజకీయాల్లో ఉన్నంత కాలంలో జగన్‌తో లేదా వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు. పక్క పార్టీల వైపు చూసే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఒక వేళ మంగళగిరిలో తాను పోటీ చేయకపోయినా వైసీపీనే గెలుస్తుందని ఆయన తేల్చి చెప్పారు.
తన కుమారుడి పెళ్లికి సీఎం జగన్‌ను పిలవకపోవడాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. అది పూర్తిగా తమ వ్యక్తిగతం అన్నారు. వాట్సప్ స్టేటస్‌లో ఫొటోలు మార్చడాన్ని కూడా మీడియా ప్రశ్నిస్తోందని, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు.