తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్‌రెడ్డి పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదనేది ఆయన వాదన. ఆయన వాదనలోని లాజిక్ ఏంటో తెలుసుకుందాం. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగింపు దశకు చేరింది. ఇప్పటికే దర్యాప్తు చాలా ఆలస్యమైందని ఇటీవల సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
సీబీఐ విచారణ అధికారిని కూడా సుప్రీంకోర్టు మార్చింది. ఏప్రిల్ నెలాఖరు లోపు దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐకి సుప్రీం డెడ్‌లైన్ విధించింది. మరోవైపు తమను ఈ కేసులో కుట్రపూరితంగా సీబీఐ ఇరికించే ప్రయత్నం చేస్తోందని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి తీవ్ర ఆరోపణ, ఆవేదన చేస్తున్నారు.
సీబీఐ విచారణను తెలంగాణకు మార్చిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ హైకోర్టులో న్యాయం కోసం వైఎస్ భాస్కర్‌రెడ్డి ఒక పిటిషన్ వేయడం చర్చనీయాంశమైంది. వివేకా హత్య కేసులో ఏ-4 నిందితుడైన దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగా తమను ఇరికించడం సమంజసమా? అని పిటిషన్‌లో భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని ఆయన నిలదీస్తున్నారు.
కేవలం సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్‌మెంట్ ఇస్తున్నాడని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. వివేకా హత్యలో దస్తగిరి కీలక పాత్ర పోషించాడని పిటిషన్‌లో భాస్కర్‌రెడ్డి ప్రస్తావించారు. దస్తగిరికి బెయిల్ ఇవ్వడాన్ని ఆయన తప్పు పట్టారు. వివేకాను చంపడానికి ఆయుధాన్ని కొనుగోలు చేసింది కూడా దస్తగిరే అని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దస్తగిరికి బెయిల్ వచ్చేందుకు సీబీఐ సహకరించిందని ఆయన ఆరోపించారు.
వైఎస్ భాస్కర్‌రెడ్డిపై తెలంగాణ హైకోర్టు ఎలా స్పందించనుందో చూడాలి. కేసు కీలక దశకు వచ్చిన నేపథ్యంలో వైఎస్ అవినాష్, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి వరుస పిటిషన్లు చర్చనీయాంశమయ్యాయి.