తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొత్త నిర్వచనం చెప్పారు. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన సంగతి తెలిసిందే. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే క్రమంలో తెలంగాణ ఉనికిని సైతం పక్కన పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా వాటిని లెక్క చేయకుండా సీఎం కేసీఆర్ తాను అనుకున్నట్టు ముందుకెళుతున్నారు. అయితే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్‌లో ముందున్న దూకుడులో కాస్త సన్నగిల్లిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కానీ తెలంగాణలో బీజేపీ మాత్రం బీఆర్ఎస్పై విరుచుకుపడుతోంది. తాజాగా ట్విటర్ వేదికగా బీఆర్ఎస్పై బండి సంజయ్ సెటైర్స్ విసిరారు. B అంటే బలత్కరీస్, R అంటే రేపిస్టులు, S అంటే లైంగిక వేధింపులని బీఆర్ఎస్కు వ్యంగ్య ధోరణిలో కొత్త నిర్వచనం చెప్పారు. నాయకుడు ఎలా ఉంటే… అనుచరులూ అలాగే ఉంటారని బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతల తీరును కూడా ఆయన ఆవిష్కరించారు.
లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో వేదికను పంచుకున్నారని దెప్పి పొడిచారు. గవర్నర్‌ను తిట్టిపోసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్‌గా ప్రమోషన్ పొండాన్ని ఆయన గుర్తు చేశారు. లైంగిక ఆరోపణలు ఉన్న మాజీ మంత్రితో కేసీఆర్ వేదిక పంచుకున్నారని ఆరోపించారు. అలాగే ప్రతిపక్ష నాయకురాలిని మరో మంత్రి మంగళవారం మరదలని పిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా ప్రభుత్వ ఉద్యోగినిపై మంత్రి లైంగిక వ్యాఖ్యలు చేసి సీఎం ప్రశంసలు అందుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ మహిళా నాయకులపై సోషల్ మీడియాలో దారుణమైన వ్యాఖ్యలతో దాడి చేశారని చెప్పుకొచ్చారు. ఇన్ని చేసినా ఎలాంటి చట్టపరమైన చర్యలు లేవన్నారు. అందుకే ఆ పార్టీకి కొత్త నిర్వచనం ఇచ్చినట్టు ఉదాహరణలతో సహా బండి సంజయ్ పేర్కొనడం చర్చనీయాంశమైంది.