2019లో ఓసీ చేతిలో ఓడిపోయిన నారా లోకేశ్, 2024లో బీసీ చేతిలో ఓడిపోతారని మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. వై నాట్ 175 అసెంబ్లీ, అలాగే 25 లోక్‌సభ స్థానాలను వైసీపీ గెలుపొందడంలో తాను సైతం భాగస్వామిని కావాలనే ఉద్దేశంతో తిరిగి ఆ పార్టీలో చేరినట్టు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్‌కు స్పష్టంగా చెప్పినట్టు ఆళ్ల వెల్లడించారు. వైసీపీలో చేరిన అనంతరం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
ఇంకో 20, 30 ఏళ్ల పాటు ప్రజాభిమానంతో వైఎస్ జగన్ సీఎంగా వుంటే పేదల జీవితాలు పూర్తిగా మారిపోతాయన్నారు. 2014, 2024లో మంగళగిరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపానన్నారు. మంగళగిరిలో టికెట్ ఎవరికి ఇచ్చినా భేషరతుగా వారి విజయానికి కృషి చేస్తానని జగన్‌తో చెప్పానన్నారు. 2009లో వైఎస్సార్‌ను ఓడించడానికి ఏ విధంగా అయితే ప్రతిపక్షాలన్నీ ఏకమై వచ్చాయో, ఇప్పుడు కూడా మరోసారి అదే పునరావృతం అవుతోందన్నారు.
పేద, మధ్య తరగతి ప్రజానీకానికి, బడుగు, బలహీనవర్గాలకు న్యాయం జరగకూడదనే ఉద్దేశంతో కొన్ని పార్టీలు ముందుకొచ్చాయన్నారు. ఈ ఎన్నికల్లో మంగళగిరిలో వైసీపీ జెండాను ఎగురవేయడమే ఏకైక లక్ష్యంతో పార్టీలో చేరినట్టు ఆళ్ల స్పష్టం చేశారు. 2019లో ఓసీ అభ్యర్థి చేతిలో లోకేశ్ ఓడిపోయారని, 2024లో బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి చేతిలో లోకేశ్ ఓడిపోతారన్నారు. ఇది రాసిపెట్టుకోవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి ధీమాగా చెప్పారు. పార్టీకి ఎక్కడెక్కడ తన అవసరం ఉందో, ఆయా నియోజక వర్గాల్లో తాను పని చేస్తానని ఆళ్ల వెల్లడించారు.