ప‌వ‌న్‌పై తీవ్ర అసంతృప్తిలో కాపు ఉద్య‌మ‌నేత‌!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై కాపు ఉద్య‌మ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారా? అంటే… ఔన‌నే స‌మాధానం జ‌న‌సేన శ్రేణుల నుంచి వ‌స్తోంది. ప‌వ‌న్ రాజ‌కీయ పంథాపై ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మొద‌టి నుంచి అసంతృప్తిగా…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై కాపు ఉద్య‌మ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారా? అంటే… ఔన‌నే స‌మాధానం జ‌న‌సేన శ్రేణుల నుంచి వ‌స్తోంది. ప‌వ‌న్ రాజ‌కీయ పంథాపై ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మొద‌టి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. అయితే కాపుల‌కు రాజ్యాధికారం సాధించే క్ర‌మంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిరు ఆశాదీపంగా క‌నిపిస్తున్నాడ‌ని, ఆ సామాజిక వ‌ర్గం ప‌దేపదే ఆయ‌న చెవిలో ఊద‌ర‌గొడుతోంది. దీంతో ప‌వ‌న్‌పై ముద్ర‌గ‌డ కోపాన్ని ప‌క్క‌న పెట్టారు.

జ‌న‌సేన‌లోకి రావాల‌ని ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయ‌కుడు బొలిశెట్టి శ్రీ‌నివాస్ గ‌త నెల‌లో ముద్ర‌గ‌డ ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. ఇందుకు ముద్ర‌గ‌డ, ఆయ‌న కుటుంబ స‌భ్యులు సానుకూల‌త వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్‌క‌ల్యాణే స్వ‌యంగా ముద్ర‌గ‌డ ఇంటికెళ్లి పార్టీలో చేర్చుకుంటార‌ని బొలిశెట్టి మీడియాకు చెప్పారు. బొలిశెట్టి చెప్పిన స‌మ‌యం కూడా దాటి నెలైంది. ఇంత వ‌ర‌కూ ముద్ర‌గ‌డ గ‌డ‌ప ప‌వ‌న్ తొక్క‌లేదు.

ముద్ర‌గ‌డ‌ను చేర్చుకోవ‌డంపై టీడీపీ అభ్యంత‌రం చెప్పింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా త‌న సన్నిహితుల వ‌ద్ద ముద్ర‌గ‌డ కీల‌క వ్యాఖ్య‌లు చేశార‌ని స‌మాచారం. జ‌న‌సేన‌లో చేరే విష‌య‌మై త‌న ఆమోదాన్ని తెలిపాన‌ని, ఇంత‌టితో కాపు నాయ‌కుడిగా బాధ్య‌త తీరిపోయింద‌ని అన్న‌ట్టు తెలిసింది. త‌న ఇంటికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌స్తే ఒక న‌మ‌స్కారం, లేదంటే రెండు న‌మ‌స్కారాలు చేస్తాన‌ని వ్యంగ్యంగా అన్నార‌ని స‌మాచారం.

ప‌వ‌న్‌తో విభేదాల‌న్నీ ప‌క్క‌న పెట్టి, జ‌న‌సేన‌లో చేరేందుకు ఆస‌క్తి చూపిన త‌ర్వాత అవ‌మానించే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ముద్ర‌గ‌డ అనుచ‌రులు మండిప‌డుతున్నారు. ప‌వ‌న్‌ను న‌మ్ముకుని, టికెట్ ఇస్తామ‌న్న జ‌గ‌న్ పార్టీని అవ‌మానించామ‌నే అంత‌ర్మ‌థ‌నం ముద్ర‌గ‌డ అనుచ‌రుల్లో మొద‌లైంది.

కాపు ఉద్య‌మ నాయ‌కుడికి మ‌ర్యాద ఇవ్వ‌క‌పోగా, ఇలా అవ‌మానించ‌డానికైనా త‌న పార్టీ నేత‌ల్ని ఇంటికి పంపి, మీడియా ముందు పెద్ద‌పెద్ద మాట‌లు మాట్లాడింద‌ని జ‌న‌సేన‌ను ముద్ర‌గ‌డ అనుచ‌రులు ప్ర‌శ్నిస్తున్నారు.