చంద్రబాబుకు ఒకనాటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నుంచి గట్టిగానే విమర్శలు వచ్చాయి. విశాఖ ప్రజల మంచితనాన్ని అమాయకత్వంగా తీసుకుని పరిపాలనా రాజధాని వద్దు అంటే చరిత్ర హీనుడుగా బాబు మిగిలిపోవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి హెచ్చరించారు. ఆమె 1985లో విశాఖ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీయార్ ఆమె ప్రతిభను మెచ్చి అప్పట్లో టికెట్ ఇచ్చారు.
తాజాగా చంద్రబాబు జరిపిన ఉత్తరాంధ్రా టూర్ లో విశాఖకు రాజధాని అవసరం లేదు అన్నట్లుగా మాట్లాడారు. అమరావతే మన రాజధాని అని తమ్ముళ్ళ చేత జై కొట్టించారు దీని మీద ఫైర్ అయిన అల్లు భానుమతి విశాఖను రాజధానిగా తీసివేసి అమరావతి పట్టుకుపోతాను అంటే ఉత్తరాంధ్ర ప్రజలు సహించరని బాబుకు సీరియస్ గానే చెప్పారు.
శివరామకృష్ణన్ కమిటీ కూడా విశాఖనే రాజధానిగా సూచించిందని ఆమె గుర్తు చేశారు. ఈ రోజుకీ అమరావతిలో సరైన మౌలిక వసతులు లేవని ఆమె మంటెక్కించే మాటలే అన్నారు. చంద్రబాబు తన సొంత లాభం కోసమే అమరావతిని రాజధానిగా చేస్తున్నారని అన్నారు.
ఇదిలా ఉండగా అమరావతి రాజధాని పేరిట వేలకోట్ల రూపాయల భూకుంభం జరిగిందని, చంద్రబాబు నాయుడు తన సొంత మనసులకు భూములను పంచిపెట్టారని అల్లు భానుమతి ఆరోపించారు. పరిపాలన వికేంద్రీకరణ వల్లే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజలు మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని సూచించారు విశాఖ రాజధాని అంటే ఎందుకు బాబుకు అంత వ్యతిరేకత అని ప్రశ్నించారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం వల్ల యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అదే విధంగా పెద్ద ఎత్తున పరిశ్రమల తరలి వస్తాయని ఆమె అంటున్నారు. అలాగే, ఉత్తరాంధ్ర నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు వలసలు తగ్గుతాయని పేర్కొంటున్నారు.
అంతే తప్ప రాష్ట్రంలో సంపదంత ఒకే చోట అమరావతిలో కేంద్రీకృతం అయితే మరో విభజన వాదం తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉత్తరాంధ్రాకు చెందిన టీడీపీ నాయకులు ఇప్పటికైనా చంద్రబాబు చేసిన ప్రకటనపై నోరు విప్పాలని, పార్టీలకతీతంగా విశాఖ పరిపాలనా రాజధాని కోసం అంతా ఏకం కావాలని ఆమె పిలుపు ఇచ్చారు.
చంద్రబాబు జై అమరావతి అని తమ్ముళ్ల చేత అనిపించి సంతృప్తి పొందుతూంటే అలా కాదు కుదరదు అంటూ ఒకనాడు ఎన్టీయార్ మెచ్చిన మహిళా నాయకురాలు, మాజీ టీడీపీ ఎమ్మెల్యే అల్లు భానుమతి బాబుకు సరైన జవాబు చెప్పేశారు.