అల్లూరి వేషం వేసిన ప్రముఖ నటుడు, టీడీపీ అధినాయకుడు స్వర్గీయ ఎన్టీయార్ విగ్రహం పార్లమెంట్ లో ఉంది. అల్లూరి విగ్రహం మాత్రం ఈ రోజుకీ లేదు. నిజంగా ఇది బాధాకరమే. అల్లూరికి ఏ రాజకీయ పార్టీ లేదు. ఆయన తరఫున వారు నాడు కేంద్ర మంత్రిగా లేరు. అందుకే ఆయన విగ్రహం లేదు అన్న బాధ అభిమానులది అయితే తప్పేముంది. నిజానికి ఎన్టీయార్ కి రాజకీయ స్పూర్తి ఇచ్చినది అల్లూరి అని చెబుతారు.
సర్ధార్ పాపారాయుడు సినిమా షూటింగులో అల్లూరి వేషధారణలో ఉండగానే ఆయనకు ప్రజాసేవ చేయాలన్న కోరిక కలిగింది. ఆ తరువాత ఎన్టీయార్ టీడీపీని స్థాపించారు. ఇక్కడ చూస్తే అల్లూరి ఎన్టీయార్ ఇద్దరూ గొప్పవారే. తెలుగు వారి నిలువెత్ అస్తులుగానే వారిని చెప్పుకోవాలి. అందులో ఎలాంటి వివాదం లేదు.
మరో వైపు చూస్తే తెల్లదొరలతో పోరాడిన అల్లూరి కేవలం ఇరవై ఏడేళ్ళకే తన ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికి తొమిదేళ్ళ క్రితం ఎన్టీయార్ విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టారు. పార్లమెంట్ ప్రాంగణంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, అల్లూరి సీతారామరాజు విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఉండగా ఒక్క ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారని, నేటి వరకు అల్లూరి విగ్రహం ఏర్పాటుకు నోచుకోలేదని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు ఆవేడన వ్యక్తం చేస్తున్నారు.
అల్లూరి విగ్రహాన్ని కూడా ఇప్పటికైనా పార్లమెంట్ లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ విగ్రహానికి అయ్యే ఖర్చులను భరించడానికి కేంద్రానికి ఆర్ధిక ఇబ్బందులు ఉంటే జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలకు లోబడి ఎన్ని లక్షలు ఖర్చు అయినా తాము ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పడం విశేషం.
ఇదిలా ఉండగా అల్లూరి పుట్టింది విశాఖ జిల్లా పాండ్రంగిలో, అసువులు బాసింది కొయ్యూరులో. అల్లూరి 125వ జయంతి ఉత్సవాలని భీమవరంలో కాకుండా విశాఖలో నిర్వహించాలని కూడా ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు జూలై 4న అల్లూరి 125వ జయంతి. ఈ సందర్భంగా ఆయన పేరిట 125 రూపే నాణాన్ని విడుదల చేయాలని కూడాపడాల వీరభద్రరావు కోరుతున్నారు.
మొత్తానికి అల్లూరి 125వ జయంతి వేళ ఇపుడు అందరూ తలుస్తున్నారు. మరి ఆయన అభిమానులు కోరినవన్నీ చేయడానికి ఏలికలు సిద్ధపడితేనే అసలైన నివాళి అని అంతా అంటున్నారు.