అమలాపురంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ విషయాన్ని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం తీవ్ర విధ్వంసానికి, ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
మంగళవారం మధ్యాహ్నం తర్వాత అమలాపురంలో పూర్తిగా పరిస్థితి అదుపు తప్పింది. ఆందోళనకారులు యథేచ్ఛగా విధ్వంసానికి తెగబడ్డారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లను తగులబెట్టారు.
అలాగే రెండు ఆర్టీసీ, ఒక ప్రైవేట్ బస్సును దగ్ధం చేశారు. ఆందోళనకారుల దాడిలో వంద మంది పోలీసులకు గాయాలయ్యాయి. స్వయాన కోనసీమ ఎస్పీ సుబ్బారెడ్డి తల పగిలి రక్తగాయాలయ్యాయి. దీన్నిబట్టి ఆందోళనకారులు ఏ స్థాయిలో విధ్వంసానికి తెగబడ్డారో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో అదనపు బలగాలను కోనసీమకు పంపారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి ప్రత్యేక దళాలను అమలాపురంతో పాటు ఆ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న ప్రాంతానికి పంపారు.
అమలాపురానికి బయటి ప్రాంతాల నుంచి జనాన్ని రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాకినాడ, రాజమండ్రి నుంచి కోనసీమ బస్సులను రద్దు చేశారు. దీంతో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం కోనసీమ ప్రశాంతంగా ఉన్నట్టు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.