కొందరు నాయకుల పరిస్థితి వేరు. వీరికి పార్టీ ముఖ్యం కాదు. ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రమే ముఖ్యం. ఈ కేటగిరీలో రెండు రకాల నాయకులు ఉంటారు. ఎప్పటికీ గెలిచే అవకాశం లేని వారు. మరోవైపు- చాలా బలమైన నాయకలు.
ఏది ఏమైనప్పటికీ.. అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ లో టికెట్ దక్కకుండా.. ఆ పార్టీని వీడుతున్న కొందరు నాయకులు.. ఎన్నికల్లో పోటీచేయడం మాత్రమే తమకు పరమావధి అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓటు బ్యాంకు అత్యంత కనిష్టం అయినప్పటికీ.. కాంగ్రెసు తరఫున ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఇప్పుడు అదే బాటలో.. చీరాల నియోజకవర్గానికి చెందిన బలమైన నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ కూడా చేరుతున్నారు.
కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నాయకత్వం కాకుండా.. ఇదివరకు ఉన్న నాయకులు గిడుగు రుద్రరాజు, శైలజానాధ్ ల సారథ్యమే ఇప్పటికీ ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు.
సీఎం జగన్మోహన్ రెడ్డిని అడ్డగోలుగా తిట్టగల షర్మిల కారణంగా ఆ పార్టీకి కొంత ఊపు వచ్చింది. ఈలోగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిత్వాల ఎంపిక పరంగా జగన్ చాలా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పలు విడతలుగా నియోజకవర్గాల్లో సర్వేలు చేయించి.. ప్రజల్లో ఆదరణ లేని వారిని పక్కన పెట్టేసి మరొకరికి టికెట్లు ఇచ్చారు.
ఆ క్రమంలో అనేకమంది సిటింగు ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదు. వారిని ఎవ్వరినీ దూరం చేసుకోవడం ఇష్టం లేని జగన్, అందరికీ గెలిచిన తర్వాత.. ఇతర అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు గానీ.. పరిస్థితిని అర్థం చేసుకుని జగన్ వెంట నిలిచిన వారు చాలా తక్కువ. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా తొలుత ఏదో ఆవేశంలో షర్మిల జట్టులో చేరారు గానీ.. కేవలం రోజుల వ్యవధిలోనే తిరిగి జగన్ పంచకు వచ్చారు.
చాలా మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం, జనసేన, బిజెపిల్లో చేరి అక్కడ టికెట్ దక్కించుకున్నారు. కానీ.. రకరకాల స్థానిక సమీకరణాల దృష్ట్యా ఆ రెండు పార్టీల్లో చేరే అవకాశం దక్కని వారు, అక్కడ టికెట్ గ్యారంటీ దక్కని వారు కాంగ్రెస్ ను ఎంచుకుంటున్నారు.
రాష్ట్రంలో జవసత్వాలు ఉడిగిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎవరు వచ్చినా చేర్చుకునే స్థితిలో ఉంది. ఎవరు అడిగినా టికెట్ ఇచ్చే స్థితిలో ఉంది. ఆ పార్టీలో చేరి.. ఎమ్మెల్యే టికెట్ పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎలీజా, ఆర్థర్ లు ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.
తాజాగా మరో కీలక నాయకుడు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధం కావడం విశేషం. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ త్వరలో షర్మిల సమక్షంలో కాంగ్రెసులో చేరబోతున్నారు. ఆ నియోజకవర్గంలో ఆయనకు వైసీపీ టికెట్ దక్కలేదు. తెలుగుదేశం కూడా మాలకొండయ్య యాదవ్ కు టికెట్ ప్రకటించేసింది.
ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆమంచి కాంగ్రెసు పార్టీ తరఫున బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. ఇండిపెండెంటుగా అనుకున్నప్పటికీ.. తర్వాత కాంగ్రెసులో చేరడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.