రాజధాని అమరావతిలో ఏకంగా 45 వేల నుంచి 50 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. రాజధాని ఏ ఒక్క వర్గానికో చెందింది కాదని, అందరిదీ అని హితవు చెబుతూ, పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యాయస్థానంలో పేదల విజయంగా తాజా తీర్పును కొందరు అభివర్ణిస్తున్నారు.
నిజానికి డబ్బున్నోళ్లదే న్యాయం అనే అభిప్రాయం సమాజంలో బలంగా వుంది. పేలాది మంది పేదలకు అత్యంత ఖరీదైన రాజధాని ప్రాంతంలో సెంటు చొప్పున స్థలం ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం అభినందనీయం. అదేంటో గానీ, రాజధానికి భూములిచ్చామే తప్ప, పేదలకు కాదంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అలాంటి వారికి న్యాయస్థానంలో చుక్కెదురైంది.
రాజధానిలో పేదలకు ఇంటిస్థలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించే వాళ్ల ఉద్దేశం… పరిశ్రమలు, పెద్దపెద్ద భవంతులు కడితే తమ భూములకు అమాంతం రేట్లు పెరిగి, ఆర్థికంగా భారీ లబ్ధి పొందుతామనే భావన ఉంటుంది. కానీ పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడం వల్ల భూముల ధరలు పెరగకపోగా, అమాంతం పడిపోతాయనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. పేదలకు స్థలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించే వారి బాధను అర్థం చేసుకోవాల్సిందే. ఎందుకంటే రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప , మరొకటి కాదని గత కొన్నేళ్లుగా చేస్తున్న విమర్శలకు వారి బాధ నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు పేదల ఇళ్ల స్థలాలకు అడ్డంకి తొలగినట్టైంది. పేదలకు దన్నుగా నిలిచిన హైకోర్టు తీర్పును సీపీఐ, సీపీఎం నాయకులు స్వాగతిస్తారా? లేక వ్యతిరేకిస్తారా? అనే చర్చకు తెరలేచింది. రాజధాని తరలింపును ఈ రెండు పార్టీలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయంలో వామపక్ష పార్టీల అభిప్రాయాలు ఎలా ఉన్నా, కనీసం పేదల విషయంలో జగన్ సర్కార్ తీసుకుంటున్న చొరవను వామపక్షాలు అభినందిస్తే బాగుంటుంది.
తద్వారా పేదలకు ఆ రెండు పార్టీలు అండగా నిలిచినట్టవుతుంది. సాధారణంగా పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలంటూ రెవెన్యూ, కలెక్టర్ కార్యాలయాల వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తుంటారు. ఆ పార్టీలకు ఆందోళనలు నిర్వహించాల్సిన అవకాశం లేకుండానే సీఎం జగన్ ఖరీదైన స్థలాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం అండగా నిలిచింది. ఇక వామపక్షాల అభిప్రాయం ఏంటనే చర్చ నడుస్తోంది.