రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో స్పీడ్ పెంచిన నాయకుడెవరైనా ఉన్నారంటే… ఆయనే కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైన పాల్ నిత్యం ఏదో ఒక సంచలన ప్రకటన చేస్తూ వుంటారు. కేఏ పాల్ లేకపోయి వుంటే, సీరియస్ రాజకీయాల్లో కామెడీ మిస్ అయ్యేదన్న అభిప్రాయం బలంగా వుంది.
ఈ నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు పోషించిన పాత్రను ఆయన పోషిస్తానని చెబుతున్నారు. చంద్రబాబు పాత్ర అంటే… గత సార్వత్రిక ఎన్నికలప్పుడు ప్రధాని మోదీని గద్దె దించడమే తన లక్ష్యమని ప్రకటించి దేశ వ్యాప్తంగా తెలుగుదేశాధినేత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షకు కేఏ పాల్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక అంశాల గురించి ప్రస్తావించడం గమనార్హం.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, తెలుగు ప్రజల హక్కు అని పాల్ స్పష్టం చేశారు. ప్రైవేటీకరణను ఆపకపోతే బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని దేశమంతా తిరిగి ప్రచారం చేస్తానని కేఏ పాల్ హెచ్చరించారు. 2007 నుంచి 2014 వరకూ బీజేపీని గెలిపించాలని తాను ప్రచారం చేసినట్టు గుర్తు చేశారు.
ఇప్పుడు 15 కోట్ల మంది తెలుగు ప్రజలు…ఒక్కొక్కరు పది మంది చొప్పున ప్రభావితం చేసి 150 కోట్ల మందికి చెప్పి బీజేపీని ఓడిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 27 కమిటీలు పని చేస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడం ద్వారా తెలుగు వారి సత్తా దేశానికి చాటి చెప్పినట్టు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడ్డానికి భయపడుతున్న పాలకప్రతిపక్ష నేతల్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు మోదీని ఓడించడానికి తాను దేశ యాత్రకు బయల్దేరుతున్నానని పాల్ చెప్పడం, గతంలో చంద్రబాబు ప్రగల్భాల్ని గుర్తు చేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.