పోరాట పంథాలో అనేక రూపాలున్నాయి. ఏదీ కూడా హద్దులు దాటకూడదు. పోరాటం స్ఫూర్తి నింపేలా ఉండాలే తప్ప, అసహ్యించుకునే పరిస్థితి రాకూడదు. తాజాగా కొందరు రైతులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. తమకు కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. దీన్ని ఓవరాక్షన్ అనకుండా, మరే పేరుతో పిలవాలో అని వ్యంగ్య కామెంట్స్ వినిపిస్తున్నాయి.
యూ-1 జోన్ తొలగించాలని కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తాడేపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు వారంతా పోస్ట్ కార్డులు రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ తప్ప, మరొకటి కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎంతసేపూ ప్రభుత్వాన్ని ఎలా బద్నాం చేయాలనే కుట్రపూరిత ఆలోచనలతోనే నష్టపోతున్నామనే విషయాన్ని ఎప్పుడు గ్రహిస్తారనే ప్రశ్నలొస్తున్నాయి. గత 13 రోజులుగా డిమాండ్ సాధన కోసం రిలేదీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని వారు వాపోయారు.
గత ప్రభుత్వ హయాంలో తాడేపల్లి పరిధిలోని అమరానగర్ ప్రాంతంలోని 178 ఎకరాలను రాజధాని అవసరాల కోసం యూ-1 జోన్గా ప్రకటించారు. ఈ భూముల్లో ఎలాంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరగకుండా నిషేధం విధించారు. అయితే తాము అధికారంలోకి వస్తే యూ-1 జోన్‌ను ఎత్తివేస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడాయన పట్టించుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాయమాటలు చెప్పడం కాకుండా, వాటిని అమలు చేసే బాధ్యతను ఇప్పటికైనా గుర్తెరిగి, రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో తాడేపల్లి రైతులు కూడా నాటకాలు వేసే బాధ్యతను సంబంధిత రంగానికి వదిలేసి, హామీని సాధించేందుకు స్నేహపూర్వక చర్చలు చేపట్టాల్సిన అవసరం ఉంది.