తీవ్ర సంచలనం రేకెత్తించిన నెల్లూరు కోర్టులో చోరీ మిస్టరీ వీడింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు పాత నేరస్తులను అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఇటీవలే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కేసుకు సంబంధించి ఆధారాలు చోరీకి గురయ్యాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాకాణితో పాటు ఇతర కేసుల ఆధారాలు కూడా చోరీకి గురయ్యాయని ప్రచారం జరిగింది. దీంతో పోలీస్‌శాఖకు ఈ కేసు సవాల్‌గా మారింది. ఈ నెల 13న చోరీ జరగ్గా, నాలుగు రోజులకు ఇద్దరిని అరెస్ట్ చేయడంతో పాటు అసలేం జరిగిందో ఎస్పీ వెల్లడించడం అనుమానాలకు తెరదించినట్టైంది.
పాత నిందితులైన సయ్యద్ హయత్, ఖాజా రసూల్ చోరీకి పాల్పడ్డారన్నారు. నిందితులు కోర్టు ప్రాంగణంలో ఇనుము చోరీకి వెళ్లారన్నారు. కుక్కలు వెంబడించడంతో కోర్టులోకి పరుగు తీశారన్నారు. అనంతరం కోర్టు తాళాన్ని పగలగొట్టి లోపలికి చొరబడి బీరువాలోని బ్యాగ్ లో ఉన్న సెల్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు తీసుకుని మిగతా పేపర్లను అక్కడే పడేశారన్నారు.
కోర్టులో చోరీపై బెంచ్ క్లర్క్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామన్నారు. విచారణలో భాగంగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద అనుమానస్పద స్థితిలో తిరుగుతున్న ఇద్దరు పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఇద్దరు 14 కేసుల్లో నిందితులని పేర్కొన్నారు. సీసీ కెమెరా దృశ్యాలను ఆధారంగా చేసుకుని సాక్ష్యాధారాలతో సహా కేసును ఛేదించినట్టు ఎస్పీ వివరించారు.
నిందితులిద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి ట్యాబ్, ల్యాప్‌ట్యాప్, 4 సెల్ఫోన్లు, 7 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వివరించారు. గత నాలుగు రోజులుగా రాజకీయ దుమారానికి తెరలేపిన ఈ కేసు ఎట్టకేలకు కొలిక్కి రావడంపై అధికార పార్టీ ఊపిరి తీసుకుంది. మంత్రిగా కాకాణి బాధ్యతలు తీసుకోవడం, మరోవైపు బలమైన ఆధారాలు ఉండడం వల్ల భవిష్యత్‌లో ఇబ్బంది వస్తుందని భావించి ఆయనే చేయించారనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వచ్చాయి. చివరికి చోరీ వెనుక పాత నేరస్తులే ఉన్నారని ఎస్పీ తేల్చడం విశేషం.