నెల్లూరులో ఒకే సమయంలో రెండు పెద్ద కార్యక్రమాలు. అది కూడా ఒకే పార్టీకి చెందిన నేతలు వేర్వేరుగా నిర్వహిస్తుండడం చర్చనీయాంశమైంది. వ్యవసాయశాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా నెల్లూరుకు వస్తున్న సందర్భంగా భారీ బైక్ ర్యాలీ, సన్మాన సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు. మరోవైపు మంత్రి పదవి పోగొట్టుకున్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు. ఇద్దరూ ఒకే సమయంలో కార్యక్రమాలను ఏర్పాటు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
మరోవైపు నెల్లూరులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీ ప్రదర్శనలు నిర్వహించే సందర్భంలో ఇలాంటి సీన్స్ చూస్తుంటాం. కానీ నెల్లూరులో అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతలే బలప్రదర్శనకు దిగడం గమనార్హం. వెయ్యి మంది పోలీసులతో నెల్లూరులో శాంతిభద్రతలను పర్యవేక్షించాలని నిర్ణయించు కోవడమే బలప్రదర్శనకు నిదర్శనంగా చెబుతున్నారు.
సాధారణ సభలైతే ఈ స్థాయిలో పోలీసులను మోహరించాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కాకాణి, అనిల్‌కుమార్ మధ్య గత కొంత కాలంగా విభేదాలున్నాయి. అనిల్ మంత్రిగా కొనసాగే సమయంలో తన నియోజకవర్గంలో కాకాణి అడుగు పెట్టనివ్వలేదు. అందుకు ప్రతీకారంగా తాను కూడా కాకాణిని నెల్లూరులో అడుగు పెట్టనివ్వద్దనే పట్టుదలతో అనిల్ ఉన్నారని సమాచారం. మంత్రి, మాజీ మంత్రి మధ్య విభేదాలు, చివరికి ఇరు నాయకుల అనుచరులు పరస్పరం ఘర్షణ దిగే వరకూ దారి తీస్తుందేమో అనే ఆందోళన లేకపోలేదు. ఇందుకు కాకాణి స్వాగత ర్యాలీని అవకాశంగా తీసుకుంటారనే భయం కూడా ఉంది.
కోవూరు నుంచి నెల్లూరుకు కాకాణి సాయంత్రం ఐదు గంటలకు బయల్దేరుతారు. పడుగుపాడు, ఆత్మకూరు బస్టాండ్, బైపాస్ రోడ్డు మీదుగా బైక్ ర్యాలీ నెల్లూరు వైసీపీ కార్యాలయానికి చేరుకుంటుంది. సరిగ్గా ఇదే సమయంలో గాంధీబొమ్మ సెంటర్‌లో అనిల్‌కుమార్ నేతృత్వంలో భారీ బహిరంగ సభ మొదలవుతుంది. సభ సమీపంలో ఎక్కడా కాకాణి స్వాగత ప్లెక్సీలు లేకుండా అనిల్ అనుచరులు చర్యలు తీసుకోవడం గమనార్హం.
ఏది ఏమైనా కాకాణి, అనిల్ మధ్య విభేదాల వల్ల భారీ పోలీసు బందోబస్తు మధ్య సభ, ర్యాలీ నిర్వహించుకోవాల్సి వస్తోందన్నది వాస్తవం. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకోనుందో చూడాలి.