వైసీపీకి నెల్లూరు జిల్లా కంచుకోట. 2014, 2019లలో వైసీపీని ఆ జిల్లా ప్రజలు ఆదరించారు. 2014లో మొత్తం పది స్థానాల్లో ఏడు, 2019లో పదికి పది స్థానాల్లో గెలిపించి వైసీపీకి నెల్లూరు జిల్లాలో తిరుగులేదని చాటి చెప్పారు. ముఖ్యంగా నెల్లూరులో రెడ్డి సామా జిక వర్గం బలంగా ఉంది. అందుకే రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో రాజకీయ పరిస్థితి ఎలా వున్నా, నెల్లూరులో మాత్రం వైసీపీనే ఆదరిస్తారు. అక్కడ ప్రతిపక్షం నామమాత్రం.
బహుశా తమ జిల్లాలో ప్రతిపక్షం బలంగా లేని కారణం కావచ్చు… స్వపక్షంలోనే విపక్షం తయారవుతోంది. నెల్లూరు వైసీపీలో అంతర్గత విభేదాలు కాస్త, ఇప్పుడు బయటపడ్డాయి. ఈ జిల్లాలో మొత్తం మూడు వర్గాలున్నాయి. మేకపాటి, కాకాణి, అనిల్ కుమార్ వర్గాలుగా వైసీపీ మూడు ముక్కలైంది. మేకపాటి వర్గంలో ఉదయగిరి, సూళ్లూరుపేట, గూడూరు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కె.సంజీవయ్య, వరప్రసాద్ ఉన్నట్టు చర్చ జరుగుతోంది.
అలాగే మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్ రెడ్డి ఒక వర్గంగా ఉన్నారు. ఇక నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ , కోవూరు ఎమ్మెల్యేలైన అనిల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డి మరో వర్గంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
వీళ్లంతా ఫైనల్‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్గంగా ప్రకటించుకోవడం విశేషం. మొత్తానికి నెల్లూరు రాజకీయం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.