జగన్ మీద వ్యతిరేకత ఎలాగోలా పుట్టించాలని విపక్షాల ప్రయత్నం. జగన్ ఇష్టం వచ్చినట్లుగా సిట్టింగులను మార్చేస్తున్నారని నమ్ముకున్న వారి గొంతు కోస్తున్నారు అని విపక్షం తెగ విలపిస్తోంది. టికెట్లు దక్కని వారి పట్ల లేని పోని ప్రేమ సానుభూతిని కురిపిస్తోంది. నిన్నటివరకూ తాము నిందించిన వారినే దగ్గరకు తీసుకోవాలని చూస్తోంది.
విశాఖలో మంత్రి గుడివాడ అమరనాధ్‌కి ఈ రోజువరకూ టికెట్ కన్ ఫర్మ్ కాలేదు. అయితే ఆయన తాను పార్టీకి జగన్ కి వీర విధేయుడిని అని పదే పదే చెబుతున్నారు. తనకు టికెట్ కాదు ముఖ్యం, జగన్ సీఎం గా మరోసారి చూడడమే అని అంటున్నారు. కానీ విపక్షాలు మాత్రం ఆయనను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి.
మాటలతో సెటైర్లు తూటాలుగా పేల్చేసే గుడివాడ ఊరుకుంటారా. అందరికీ కలిపి ఒక్కటే అన్నట్లుగా జవాబు ఇచ్చారు. తాను పార్టీకి జగన్ కి విధేయుడిని అని స్పష్టం చేశారు. జగన్ కుర్చీలో కూర్చుని సమీక్ష చేశాను అని విపక్షాలు మాట్లాడడాన్ని తప్పు పట్టారు.
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. సొంత మామ కుర్చీ లాక్కున్న చంద్రబాబుకు ఆయన పార్టీ వారికీ అన్నీ అలాగే కనిపిస్తాయని అన్నారు. తమ నాయకుడు జగన్ కి తామంతా సైనికులుగా మాత్రమే ఉంటామని అన్నారు.
జగన్ అనుకుంటే ఎవరినైనా ఏ అందలం మీద అయినా కూర్చోబెట్టే మనసు ఉన్నవారు అని కితాబు ఇచ్చారు. తమ పార్టీ అధినేత గురించి తన గురించి మాట్లాడడం విపక్షాల దుర్నీతికి నిదర్శనం అన్నారు. చంద్రబాబు కుర్చీలోనే బాలయ్య కూర్చుంటున్నాడని ముందు ఆ సంగతి వారు చూసుకోవాలని సలహా ఇచ్చారు.
టీడీపీ నేతల కంటే తెలివి తక్కువ దద్దమ్మలు ఎవరూ ఉండరని గుడివాడ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఇటీవల కుటుంబ సభ్యులతో సహా గోవా వెళ్లి వచ్చిన మంత్రి మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఆయన లేని టైం చూసి వైసీపీ పట్ల అసంతృప్తి అని వండి వార్తలు రాస్తున్న విపక్షాల సంబరానికి మంత్రి తెర దించేశారు.