వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సాయం తీసుకుని ఒడ్డున పడాలని టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీతో పొత్తులో ఎవరిది పై చేయి అన్నది తేలలేదు. అమిత్ షాతో చర్చల సారాంశం బయటకు తలో రకంగా వస్తోంది. బీజేపీతో పొత్తు ఇంకా అలా ఉండగానే టీడీపీలో చిచ్చు రేగుతోంది.
బీజేపీతో పొత్తు వద్దంటూ తమ్ముళ్ళు అంటున్నారు. కానీ బాబు మాత్రం కాషాయం పార్టీతో కలసి నడవాలనే చూస్తున్నారు. దీంతో ఆయన తొలి షాక్ భారీగానే తగిలింది. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేత. సీనియర్ మోస్ట్ లీడర్ అయిన ఉత్తరాంధ్రా ప్రముఖుడు కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ టీడీపీకి రాజీనామా చేశారు.
ఆయన చంద్రబాబుకు రాసిన లేఖ మాత్రం గుంటూరు కారం స్థాయిలో ఉంది. అధికారం కోసం ఆత్మను అమ్ముకోలేనంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీకి సంబంధించి ఏ ఒక్క విభజన హామీ నెరవేర్చని బీజేపీతో ఎలా కలసి అడుగులు వేస్తారంటూ ఆయన చంద్రబాబుని సూటిగానే ప్రశ్నించారు.
అధికారం కోసం విద్వేష శక్తులతో చేతులు కలుపుతారా అని ఆయన బాబుని నిలదీశారు. బీజేపీ ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వలేదు ఏపీకి తీరని అన్యాయం చేసింది అని ఆయన గుర్తు చేశారు. అయినా సరే బీజేపీ వెంట నడుస్తామంటే తాను మాత్రం ఆ పని చేయలేనని అందుకే పార్టీలో తాను కొనసాగలేనని అంటూ ఆయన బాబుకు రాజీనామా లేఖను పంపించారు.
ఒక వైపు టీడీపీ బీజేపీ పొత్తు పొడవనే లేదు, ఇంతలోనే పసుపు పార్టీలో ఈ తరహా ప్రకంపనలు రావడంతో టీడీపీలో రగులుతున్న తమ్ముళ్ళు ముందు ముందు మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున అరకు నుంచి పోటీ చేసిన కిశోర్ చంద్రదేవ్ వైసీపీ చేతిలో ఓటమి పాలు అయ్యారు. ఆనాడు కురుపాం సంస్థానధీశుడు గొప్ప వారు అని కిశోర్ ని కీర్తించిన టీడీపీ ఇపుడు ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.